కేసు నమోదు...
కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ రోడ్డుపై ధర్నా
● మద్దతు పలికిన విద్యార్థి సంఘాలు
● ఆర్డీఓ హామీతో విరమించిన వైనం
గద్వాల క్రైం: గద్వాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి తరుణ్ (17) మంగళవారం ఇంట్లో ఉరేసుకొని మృతి చెందిన సంఘటన విదితమే. అయితే బుధవారం ఉదయం జిల్లా ఆస్పత్రి వద్ద ఫ్లైఓవర్ రోడ్డుపై విద్యార్థి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు బైఠాయించి ధర్నా చేపట్టారు. విద్యార్థి మృతికి కారణమైన ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలు శిరీషను విధుల నుంచి తొలగించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ముందు హేళనగా మాట్లాడటం, చెంపదెబ్బ కొట్టడం ద్వారా తరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్జెక్ట్ లెక్చరర్ కాకున్నా ఆమె చేసిన నిర్వాకం కారణంగా అమయాక విద్యార్థి మరణానికి కారణమైందని, తక్షణమే సదరు అధ్యాపకురాలిని అరెస్టు చేసి చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందిగా కోరారు. పోలీసులు శాంతింపజేసేంకు ప్రయత్నం చేయగా ఫలితం లేకపోయింది. ఆర్డీఓ శ్రీనివాస్‌రావు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థి మృతిపై న్యాయ విచారణ చేపట్టి రూ. 50లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉదోగ్యం ఇవ్వాల్సిందిగా విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని ఆర్డీఓ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
నిందితురాలైన అధ్యాపకురాలు శిరీషపై మృతుడి సోదరుడు మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉందని, త్వరలో అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతామన్నారు. అదే విధంగా విద్యార్థి మృతి విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు.
మహిళ లెక్చరర్ విధుల్లో చేరినప్పటి నుంచి విద్యార్థులతో ఆమె వ్యవహరించే తీరు సైతం విమర్శలు ఉన్నాయి. సంబంధం లేని విషయాలో జోక్యం చేసుకోవడం ఉంటుందని కొంతమంది విద్యార్థులు చెబుతున్నారు. మరోవైపు విద్యార్థి మృతికి కారకులైన అధ్యాపకురాలి ద్వారా రూ.8 లక్షలు చెల్లించేందుకు కొందరు డిమాండ్ చేస్తుండటం కొసమెరుపు.


