● శేషవాహనంపై లక్ష్మీవేంకటేశ్వరుడు
● ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం శనివారం జనసంద్రమైంది. ఆషాడ శుద్ధ(తొలి ఏకాదశి)ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు మన్యంకొండకు తరలివచ్చారు. ఆషాడంలో వచ్చే తొలి ఏకాదశి వేడుకలను ప్రతిఏటా అత్యంత ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వివిధ పూజలు చేశారు.
కనులపండువగా సేవలు
తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శోభాయామానంగా అలంకరించిన శేషవాహనంలో స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న సభా మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తుల హరినామస్మరణ మధ్య ఊరేగింపు ముందుకు కదిలింది. శేషవాహనంలో స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి సేవను చూసి భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. అనంతరం హనుమద్దాసుల మండపం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 7 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. దేవస్థానం ముందున్న కోనేరు నుంచి గర్భగుడి వరకు భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. అలాగే దేవస్థానం పక్కనున్న శివాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు దిగువ కొండ నుంచి కొండపై వరకు కాలినడకన వచ్చి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. వేడుకల సందర్భంగా స్వామివారి గర్భగుడిని సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, అళహరి రామకృష్ణ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.


