చిన్నచింతకుంట: తొలి ఏకాదశిని పురష్కరించుకొని అమ్మాపురం కురుమూర్తి స్వామి ఆలయంలో శనివారం గోవింద నామస్మరణ మారుమోగింది. స్వామివారి దర్శనానికి భక్తులు ఉదయం నుంచే ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తుల రద్దీతో కనిపించింది. కురుమూర్తి గిరులలో గోవింద నామస్మరణ మారుమోగింది.
భక్తిశ్రద్ధలతో లక్షపుష్పార్చన
తొలి ఏకాదశిని పురస్కరించుకొని కురుమూర్తి స్వామికి ఆలయ సిబ్బంది లక్షపుష్పార్చన నిర్వహించారు. ఆలయ బ్రాహ్మణుల మంత్రోశ్ఛణల మధ్య వివిధ రకాల పూలతో స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు పుష్పార్చన చేశారు. అంతకుముందు స్వామి, అమ్మవార్లకు పూజారులు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉత్సవ విగ్రహాలను మహామండపంలో ఉంచారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తుల దంపతుల చేతుల మీదుగా అర్చన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి దంపతులు స్వామివారికి రెండు వందల గ్రాముల వెండిని మొక్కుబడిగా సమర్పించారు. వారికి ఆలయ సిబ్బంది శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ భత్తుల బాల్‌రాజు, ఈవో మదనేశ్వరెడ్డి, కమిటీ సభ్యులు మైపాల్‌రెడ్డి, తిరుపత్‌రెడ్డి, ఆలయ సిబ్బంది, భక్తులు తదతరులు పాల్గొన్నారు.


