ప్రాణాలు పణంగా.. చదువుల ప్రయాణం
నడక తప్పట్లేదు
రోజూ ఉదయాన్నే తయారై బస్సు కోసం చూస్తాం. కానీ ఒక్కటే బస్సు ఉండటంతో అందులో చోటు దొరకదు. తప్పక రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. బ్రిడ్జి దాటేటప్పుడు రైలు వస్తే చాలా భయ మేస్తుంది. మాకు చదువు కావాలి కానీ, ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడలేకపోతున్నాం. వెంటనే అదనపు బస్సు సౌకర్యం కల్పించాలి.
– వైష్టవి, 9వ తరగతి
ప్రమాదం అంచున..
బ్రిడ్జి పైన నడుస్తున్నప్పుడు రైలు కూత వినిపిస్తే కాళ్లు వణికిపోతాయి. పక్కకు తప్పుకోవడానికి కూడా సరిగ్గా చోటు ఉండదు. సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి చీకటి పడుతోంది. అధికారులకు మా కష్టాలు కనిపిస్తలేవా? ప్రతిరోజూ యుద్ధం చేస్తున్నట్టే ఉంది మా ప్రయాణం. – మణివర్ధన్, 10వ తరగతి
మదనాపురం: అక్షరం నేర్చుకోవాలంటే ఆశయం ఉండాలి. కానీ, ఇక్కడ ఆశయంతోపాటు సాహసం కూడా చేయాల్సిందే. బడికి వెళ్లాలన్నా.. ఇంటికి రావాలన్నా విద్యార్థులకు అడుగడుగునా గండాలే ఎదురవుతున్నాయి. మదనాపురం మండలంలోని నర్సింగాపురం, నెల్విడి, కొన్నూరు, ద్వారకానగర్ గ్రామాల విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ప్రభుత్వాలు విద్యార్థుల కోసం అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రకటిస్తున్నా.. మండల విద్యార్థులకు కనీసం బస్సు సౌకర్యం కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నాయి. ఆయా గ్రామాల నుంచి సుమారు 100 మందికిపైగా విద్యార్థులు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకోవడానికి మండల కేంద్రానికి రావాల్సిందే. ఉదయం 7.40 గంటలకు వచ్చే ఒక్క బస్సు తప్పా మరే ఇతర రవాణా సౌకర్యం వారికి అందుబాటులో లేదు. ఆ ఒక్క బస్సులో అందరూ వెళ్లలేక, సగం మంది విద్యార్థులు కాలినడకనే పాఠశాలకు చేరుకోవాల్సి వస్తోంది. ఈ ప్రయాణంలో విద్యార్థులు మదనాపురం సమీపంలోని రైల్వే ట్రాక్ బ్రిడ్జిపై ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నడుస్తున్నారు. ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు సాగిస్తుంటే పక్కకు తప్పుకోవడానికి కూడా చోటులేని ఆ ఇరుకై న బ్రిడ్జిపై విద్యార్థులు పడుతున్న అవస్థలు చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా, లేదా రైలు వచ్చే సమయంలో కంగారుపడినా ఘోర ప్రమాదం జరిగే అవకాశం ఉంది. చదువు కోవడానికి వెళ్తున్న పిల్లలు క్షేమంగా తిరిగి వస్తారో లేదో అని తల్లిదండ్రులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
రైల్వేట్రాక్‌పై విద్యార్థులప్రమాదకర నడక
నాలుగు గ్రామాలకు కలిపి ఉదయం ఒకే బస్సు సౌకర్యం
అధికారులకు పట్టని చిన్నారుల ఇక్కట్లు
ప్రాణాలు పణంగా.. చదువుల ప్రయాణం


