వేరుశనగ యంత్రం బోల్తా.. వృద్ధుడి దుర్మరణం
తిమ్మాజిపేట: మండలంలోని బావాజిపల్లి సమీపంలో వేరుశనగ మిషన్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తాడూర్ మండలంలోని గోవిందాయపల్లికి చెందిన వేరుశనగ మిషన్ మారేపల్లి సమీపంలో ఓ రైతు పొలంలో వేరుశనగ పంట నూర్పిడి చేశాక.. తిరిగి వెళ్తున్న క్రమంలో బావాజిపల్లి సమీపంలో మలుపు ఉండడం కూలీలందరూ కిందకు దిగగా.. బాలయ్య (61) అలానే కూర్చొన్నాడు. ఈ క్రమంలో మలుపు వద్ద మిషన్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బాలయ్య మిషన్ కింద పడి దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
విద్యుదాఘాతంతో
వ్యక్తి మృతి
నవాబుపేట: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ఇప్పటూర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. ఇప్పటూర్‌కు చెందిన బెస్త యాదయ్య (55) గ్రామ సమీపంలో సోలార్ ప్లాంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. గురువారం యథావిధిగా విధులకు వెళ్లిన ఆయనకు రాత్రి సమయంలో సోలార్ ప్లాంట్‌లో ఉన్న బోరు వద్ద విద్యుత్ షాక్ తగిలి అపస్మారక స్థితిలో పడిపోయాడు. దీంతో అక్కడే ఉన్న మరో వ్యక్తి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో మృతుడి కుమారుడు బెస్త హరికృష్ణ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు.
పోలీసు కస్టడీలో మాజీ సర్పంచ్ హత్య నిందితులు
గద్వాల క్రైం: గతేడాది నవంబర్ 21న కేటీదొడ్డి మండలంలోని నందిన్నె మాజీ సర్పంచ్ భీమరాయుడును కర్నూల్ జిల్లాకు చెందిన సుపారీ గ్యాంగ్ బొలెరా గూడ్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన విధితమే. శుక్రవారం కోర్టు అనుమతితో కేసులోని నిందితులు ఏ1 మిల్లు వీరన్న, ఏ2 సురేందర్, ఏ3 బోయ వీరన్న, ఏ5 తెలుగు కృష్ణ, ఏ6 తెలుగు మధుబాబులను గద్వాల పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. హత్యకు దారీ తీసిన రాజకీయ, ఆర్థిక, భూ సంబంధ, పాత కక్షలపై విచారణ చేపడుతున్నారు. హత్య చేసేందుకు ముఠా సభ్యులు కుదుర్చుకున్న ఒప్పంద వ్యవహారంలో ఏ1తో ఏర్పడిన పరిచయంపై విచారణ చేసినట్లు తెలిసింది. సుపారీ గ్యాంగ్‌కు ఆర్థికపరమైన విషయంలో సహకరించిన వ్యక్తులు, గూడ్స్ వాహనంతో హత్య చేస్తే కేసు నుంచి తప్పించుకోవచ్చని చెప్పిన వ్యక్తులెవరు.. హత్య వెనుక మృతుడి బంధువుల ప్రమేయం.. హత్యలో పాత్రదారులుగా రాజకీయ నాయకులు ఉన్నారా.. అనే కోణంలో ఏ1 మిల్లు వీరన్నను విచారించినట్లు సమాచారం. హత్యకు సహకరించిన నిందితులను సైతం విడివిడిగా విచారించారు. ఈ విషయంపై గద్వాల సీఐ శ్రీనును ‘సాక్షి’ సంప్రదించగా కోర్టు అనుమతితో నిందితులను కస్టడీలోకి తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుగుతుందని, త్వరలో వివరాలను వెల్లడిస్తామని సీఐ తెలిపారు.
ఆధార్ సేవ కేంద్రంలో చోరీ
జడ్చర్ల: స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న ఆధార్ సేవా కేంద్రంలో చోరీ జరిగింది. చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ట్లు కేంద్ర నిర్వాహకులు రఫిక్ శుక్రవారం తెలిపారు. తాళాలు పగులగొట్టి కంప్యూటర్ మానిట ర్ ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


