అడవిలో అమ్మ.. పర్వతాపూర్ మైసమ్మ
● సెంటిమెంట్ దేవతగా ప్రతీతి
● నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం.. వారం పాటు కొనసాగింపు
● ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
నవాబుపేట: తరతరాలుగా కొలిచిన వారి కోర్కెలు తీరుస్తూ ఇష్ట దైవంగా పేరొందింది పర్వతాపూర్ మైసమ్మ దేవత. జిల్లాకేంద్రం నుంచి మండల కేంద్రానికి వెళ్లే మార్గంలో 9 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో వెలిసిన మైసమ్మ ఆలయం కాకర్లపహాడ్ గ్రామపంచాయతీ పరిధిలో ఉంది. ప్రస్తుతం ఉన్న స్థలంలోనే ఓ నెమలి చెట్టు కింద పుట్టలో అమ్మవారి విగ్రహం బయట పడిందని పూర్వీకులు చెబుతున్నారు. కట్టెలు కొట్టి విక్రయించే వ్యక్తి అడవిలో దారి తప్పితే చెట్టుకింద ఉన్న ఓ శిల ప్రత్యేక కాంతి రూపంలో దారి చూపిందని.. మరుసటి రోజు ఆ వ్యక్తి గ్రామస్తులకు విషయం చెప్పి పూజలు చేయడం ప్రారంభించినట్లు ప్రతీతి.
ఆది, మంగళవారం రద్దీ..
జిల్లావాసులు చాలామంది కొత్త వాహనం కొనుగోలు చేసినా, ఏదేని శుభకార్యాలు, ఎన్నికల ప్రచారాలు దేవాలయం వద్ద పూజలు నిర్వహించి ప్రారంభిస్తారు. దీంతోపాటు ఆది, మంగళవారం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక బోనాలు సమర్పించడం ఇక్కడ ప్రత్యేకం. కాగా ఆలయం అభివృద్ధి చెందుతుండటంతో ఇతర రోజుల్లో సైతం భక్తుల రద్దీ కనిపిస్తుంది.
ఆలయ అభివృద్ధి..
కాకర్లపహాడ్‌కు చెందిన నారాయణరెడ్డి మొదట ఆలయ నిర్మాణం చేపట్టారు. తాజాగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి రూ.కోటితో అమ్మవారికి నగలు చేయించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. అలాగే గతంలో ఎంపీ మల్లు రవి, మాజీ మంత్రి లక్మారెడ్డి, నాటి ఎమ్మెల్యేలు ఎర్ర సత్యం, చంద్రశేఖర్, ఎర్ర శేఖర్, మాజీ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రుమాండ్ల రామచంద్రయ్య తదితరులు రూ.కోట్లు వెచ్చించి ఆలయాన్ని అభివృద్ధి చేశారు.
అన్ని ఏర్పాట్లు చేశాం..
ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశాం. బోనాల రోజు ఆలయానికి వచ్చే భక్తులందరూ ఆలయం వద్ద బోనాలు సమర్పించేందుకు సౌకర్యాలు కల్పించాం.
– జగన్‌మోహన్‌రెడ్డి, ఆలయ చైర్మన్
అడవిలో అమ్మ.. పర్వతాపూర్ మైసమ్మ
అడవిలో అమ్మ.. పర్వతాపూర్ మైసమ్మ


