ఆలయాల వద్ద పోలీస్ బందోబస్తు
పాలమూరు: వైకుంఠ ఏకా దశి సందర్భంగా ఆలయా ల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎస్పీ జానకి మంగళవారం జిల్లా లో వివిధ ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్ల ను పరిశీలించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. కట్టుదిట్టమైన ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని సిబ్బందికి సూచించారు.
ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్
బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రత్యేక పోలీసు బృందాలతో జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై చట్ట ప్రకా రం కఠిన చర్యలు తీసుకుంటామని, పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ధాన్యం సేకరణ పూర్తిచేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): తుదిదశకి చేరుకున్న ధాన్యం కొనుగోళ్లు, సేకరణ వేగవంతంగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ ఆదేశించారు. వానకాలం 2025–26 ధాన్యం సేకరణపై మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పౌర సరఫరాలశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిల్లర్ల నుంచి పొందిన బ్యాంకు గ్యారంటీలను పరిశీలించగా, మిల్లర్లకు అందజేసిన పాడికి సంబంధించి ఇంకా పెండింగ్‌లో ఉన్న బ్యాంకు గ్యారంటీలను మూడురోజుల్లో కచ్చితంగా సేకరించాలని పౌరసరఫరాల శాఖ డీటీలను ఆదేశించారు.ఇప్పటివరకు జిల్లాలో 26,015 మంది రైతుల నుంచి 1,30,459 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు.
సీఎం ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి
సీఎం ప్రజావాణి ఫిర్యాదులతో పాటు కలెక్టర్ ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్ నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. ఎన్నికల ఓటరు గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.


