‘ముక్కోటి’ దర్శనభాగ్యం
● వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
● ఉత్తరద్వారం ద్వారా దర్శనమిచ్చిన స్వామివారు
● ఘనంగా శేషవాహన సేవ,
జనసంద్రమైన మన్యంకొండ
మన్యంకొండలో శేషవాహనంలో ఊరేగుతున్న లక్ష్మీవేంకటేశ్వరస్వామి
మన్యంకొండలో శేషవాహనంపై ఊరేగుతున్న లక్ష్మీవేంకటేశ్వరస్వామి
మహబూబ్‌నగర్ రూరల్/చిన్నచింతకుంట: మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం మంగళవారం జనసంద్రమైంది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు.ఽ ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి వేడుకలను మన్యంకొండలో ప్రతిఏటా అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగానే దేవస్థానంలో ఈ ఏడాది కూడా ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్త కోటికి దర్శనమిచ్చారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అలంకారోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారి శేషవాహనసేవ నిర్వహించారు. శోభాయామానంగా అలంకరించిన శేషవాహనంలో స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న సభామండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తుల హరినామశ్చరణ మధ్య ఈ ఊరేగింపు ముందుకు కదిలింది. శేషవాహనంలో స్వామివారు ఊరేగుతూ స్వర్ణాభరణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి సేవను చూసి భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. అనంతరం స్వామివారిని తిరిగి శేషవాహనంలో హనుమద్దాసుల మండపం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి పూలపందిరిలో స్వామివారిని శేషవాహనంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాటు చేశారు. దేవస్థానంలో ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారాన్ని కూడా ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ ద్వారం గుండానే భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. ఉదయం 6:30 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. దేవస్థానం ముందున్న కోనేరు నుంచి గర్భగుడి వరకు భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. ఎక్కడ చూసిన మన్యంకొండలో భక్తులే కనిపించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే దేవస్థానం పక్కనున్న శివాలయంలో కూడా భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చాలా మంది భక్తులు దిగువ కొండ నుంచి కొండపై వరకు కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కొంతమంది తలనీలాలు సమర్పించి తమ మొక్కులు సమర్పించారు. దేవస్థానంతోపాటు స్టేజీ సమీపంలోని అలివేలు మంగతాయారు దేవస్థానంలో కూడా ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల సందర్భంగా స్వామివారి గర్భగుడిని సర్వాంగసుందరంగా ముస్తాబుచేశారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారితోపాటు పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
కాంచనగృహలో వైకుంఠ దర్శనం
● చిన్నచింతకుంట మండలం అమ్మాపురం కాంచన గృహలో వెలిసిన వేంకటేశ్వరస్వామి ప్రతిరూపమైన కురుమూర్తిస్వామి ఆలయానికి భక్తులు మంగళవారం పోటెత్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే కురుమూర్తి కొండకు చేరుకున్నారు. ఆలయ సిబ్బంది ఆలయాన్ని శుద్ధి చేసి ఉత్తర ద్వారంతోపాటు ఆలయ ప్రాంగణమంతా పూలమాలలతో అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. వివిధ ప్రాంతాలనుంచి తరలి వచ్చిన భక్తులు ఉత్తరద్వార దర్శనం చేసుకొని తరించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
నేడు గిరి ప్రదక్షిణ
కురుమూర్తి స్వామి ఆలయం వద్ద బుధవారం గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నట్లు విశ్వహిందూ పరిషత్ మండలాధ్యక్షుడు శివన్న తెలిపారు. కార్యక్రమానికి హిందూ సంఘాలు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి వివిధ గ్రామాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
‘ముక్కోటి’ దర్శనభాగ్యం
‘ముక్కోటి’ దర్శనభాగ్యం
‘ముక్కోటి’ దర్శనభాగ్యం


