ముసాయిదా ప్రక్రియ షురూ
● మున్సిపల్ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల పునర్ వ్యవస్థీకరణ
● కార్పొరేషన్ అధికారులతో అడిషనల్ కలెక్టర్ సమావేశం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం ఓటరు జాబితాకు సంబంధించి ముసాయిదా ప్రక్రియ ఆరంభమైంది. మొదటిరోజు మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయనున్న పోలింగ్‌కేంద్రాలను గుర్తించారు. గతంలో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న పాలమూరు ఈ ఏడాది జనవరి 27న కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయింది. అప్పట్లో ఉన్న 49 వార్డులు ఇప్పుడు 60 డివిజన్లకు పెరిగాయి. దీంతో తాజాగా పోలింగ్ కేంద్రాలను పునర్ వ్యవస్థీరించారు. ఇక 2023 అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ఆయా వార్డుల వారీగా బుధవారం విభజించనున్నారు. ఈ వివరాలను జనవరి 1న కార్యాలయం నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచనున్నారు. ఒకవేళ వీటిపై ఏమైనా అభ్యంతరాలు వస్తే స్వీకరిస్తారు. చివరకు 10న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు.
ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలి
మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్ సూచించారు. మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల పునర్ వ్యవస్థీకరణ, డివిజన్ల వారీగా ఓటరు జాబితా విభజనను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు అంద రూ అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఏఎంసీ అజ్మీర రాజన్న, ఇన్‌చార్జ్ ఎంఈ విజయ్‌కుమార్, ఏసీపీ కరుణాకర్‌గౌడ్, ఆర్‌ఓ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


