పప్పుశనగకు పచ్చపురుగు
● నివారణ చర్యలు చేపట్టకపోతే నష్టమే
అలంపూర్: వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని లాభాలు ఆర్జించడానికి రైతన్నలు ఎక్కువగా పప్పుశనగ సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. సాగు నీటి వనరులు పుష్కలంగా లేకపోవడంతో తక్కువ నీటితో సాగయ్యే పప్పుశనగను నమ్ముకొని సాగు చేపట్టారు. మండలంలో ఉన్న పొలాలకు అనువుగా రైతులు ఆయా రకాల విత్తనాలతో పంటను సాగు చేస్తున్నారు. అయితే పంటకు పచ్చపురుగు వ్యాప్తి అధికంగా ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్ రైతులకు పలు సూచనలు చేశారు. పచ్చపురుగు పంటకు ఆశిస్తే ముందుగా ఆకు చివర బంగారు రంగులో గుడ్లు పెడుతుందని, నాలుగు రోజుల తర్వాత గుడ్డు నుంచి పురుగు బయటికి వచ్చి కాయలను, పూతను, పిందెలను తింటూ పంటకు నష్టం కలిగిస్తుందన్నారు.
60–80 శాతం వరకు తగ్గనున్న దిగుబడి
పచ్చపురుగు ఆకులను తింటూ కాయలోకి చేరుకుంటుంది. గింజలోకి చేరిన పచ్చపురుగు లోపలి కాయను మాత్రమే తింటూ తొట్టేను వదిలేస్తుంది. వీటి ఉధృతి ఎక్కువగా ఉంటే పంటపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దాదాపు 60 నుంచి 80 శాతం వరకు దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు వివరిస్తున్నారు.
పచ్చపురుగు నివారణ ఇలా...
● 1. ముందుగా 5 మిల్లిలీటర్ల వేపనూనెను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీన్ని పిచికారీ చేయడం వల్ల గుడ్డు నాశనం అవుతుంది.
● 2. వేప నూనెలో ఉన్న కషాయం వలన పంటను తినలేక పురుగు చనిపోతుంది.
● 3. క్లోరో 2 మి.లీ లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే ఫలితం ఉంటుంది.
● 4. కోరాజెన్ (రెనాక్సిపెర్) 0.3 మి.లీ మందును లీటర్ నీటితో కలిపి పంటపై చల్లుకోవాలి.
● 5. ప్లూ బెండమైడ్ 0.3 మి.లీ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
● 6. ప్లీతోరా 1మి.లీ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ఉత్తమం.
కాయ బరువు పెరగడానికి...
పంట సాగులో కాయ బరువు, కాయ పూర్తిగా నిండుటకు 13:45 పోషకాన్ని లీటర్ నీటికి 5 గ్రామాలు కలిపి పిచికారీ చేసుకుంటే లాభాదాయకంగా ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే పంట దిగుబడిని పెంచి లాభాలు ఆర్జించవచ్చని సూచించారు.
పాడి–పంట
పప్పుశనగకు పచ్చపురుగు
పప్పుశనగకు పచ్చపురుగు
పప్పుశనగకు పచ్చపురుగు


