అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ధూప, దీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ధూప, దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ కోరారు. పట్టణంలోని సింహగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ కల్యాణ మండపంలో శనివారం ధూప, దీప నైవేద్య అర్చక సంఘం ఉమ్మడి జిల్లా సమావేశం నిర్వహించారు. అంతకుముందు రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో చేపట్టిన అర్చక చైతన్యయాత్రకు జిల్లా కేంద్రంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత లేకపోవడంతో డీడీఎన్ అర్చకుల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం డీడీఎన్ అర్చకుడికి రూ.6వేల వేతనం, దీప నైవేద్యం కోసం రూ.4వేలు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతినెలా డీడీఎన్ అర్చకులకు రూ.25వేల వేతనం, దీప నైవేద్యానికి రూ.10వేలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతినెల 5వ తేదీలోగా వేతనం ఇవ్వాలని, హెల్త్‌కార్డులు, ఈహెచ్‌ఎస్ గుర్తింపు కార్డులు అందజేయాలని, అర్చకులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని కోరారు. అర్చక సంక్షేమ పథకాలకు సంబంధించి అవగాహన కల్పించాలని, హైదరాబాద్ బర్కత్‌పురలో నిరుపయోగంగా ఉన్న అర్చక భవన్‌కు మరమ్మతులు చేయించి డీడీఎన్ అర్చకులకు కేటాయించాలని కోరారు. 33జిల్లాల అర్చకుల త్రీమెన్ కమిటీలు ఏర్పాటు చేసి, ప్రతి జిల్లా నుంచి ఇద్దరూ డీడీఎన్ అర్చకులకు కమిటీలో స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఎండోమెంట్ కార్యాలయంలో ఏసీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కోశాధికారి, హరికిషన్, కార్యవర్గ సభ్యులు పరిపూర్ణానందాచారి, నరేంద్రచార్యులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రవికుమార్, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు జంగం మహేశ్‌కుమార్, కార్యదర్శి కుమారస్వామి, వనపర్తి అధ్యక్షుడు లక్ష్మీకాంతాచార్యులు, నారాయణపేట అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, నాగర్‌కర్నూల్ అధ్యక్షుడు చంద్రశేఖర్, గద్వాల అధ్యక్షుడు చక్రవర్తిచార్యులు, ప్రతినిదులు పవన్‌కుమార్, జయతీర్థచార్యులతోపాటు వివిధ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.
‘డయల్ 100’కు తక్షణ స్పందన
వనపర్తి: అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓ వ్యక్తి ప్రాణాన్ని పోలీసులు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎకో పార్క్ వద్ద రోడ్డు పక్కన ఓ వ్యక్తి నిస్సహాయంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. డయల్ 100కు సమాచారం అందించారు. రెండు నిమిషాల్లోనే వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ అశోక్, హోంగార్డు మాలిక అక్కడికి చేరుకున్నారు. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఆ వ్యక్తిని అత్యంత జాగ్రత్తగా వాహనంలో ఎక్కించి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడికి చికిత్స అందించడంతో ఆరోగ్యం కొంత మెరుగుపడింది. నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన పోలీసులను పలువురు అభినందించారు.
అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి


