పర్యాటక కేంద్రంగా కోయిల్‌సాగర్
● రూ.9.50 కోట్లతో అభివృద్ధిపనులకు ప్రణాళికలు సిద్ధం
● కేఎస్పీని సందర్శించిన ఎమ్మెల్యే, టూరిజం అధికారులు
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి రూ.9.50 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం టూరిజం శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కోయిల్‌సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు వద్ద చేపట్టే పనులకు సంబంధించిన ప్రణాళికలను అధికారులు వివరించారు. పర్యాటకులకు కల్పించే అన్ని సౌకర్యాలకు సంబంధించిన మ్యాప్‌లను అధికారులు చూపించారు. ప్రాజెక్టు సమీపంలో కాటేజీల నిర్మాణం, చిల్డ్రన్స్ పార్కు, రెస్టారెంట్, ప్రాజెక్టు నీటిలో బోటింగ్ వంటివి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు వద్ద నిర్మాణాల కోసం కావాల్సిన స్థలాలను వారు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కోయిల్‌సాగర్ వద్ద అభివృద్ధి పనులకు గతంలో రూ.3.5 కోట్లు మంజూరు కాగా.. నిధులు పెంచాలని చేసిన ప్రతిపాదనలకు అనుకుణంగా రూ.9.5 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. గతేడాది మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించి ఇక్కడ పర్యాటక కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారని ఆ మేరకు ఇప్పుడు నిధులు కేటాయింపులు చేశారన్నారు. త్వరలో టెండర్లు పిలుస్తారని ఆ తర్వాత పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, నియోజకవర్గాన్ని అన్నివిధాల ముందుకు తీసుకెళ్తామని వివరించారు. కార్యక్రమంలో టూరిజం శాఖ డీఈ పరుశవేది, ఆర్కిటెక్చర్ ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అంజిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


