సైబర్.. టెర్రర్
జిల్లాల్లో గణనీయంగా పెరిగిన సైబర్ నేరాలు
● ఉమ్మడి పాలమూరులోని 4 జిల్లాల్లో ఇదే పరిస్థితి
● ఈసారి మొత్తం 3,625 ఫిర్యాదులు.. 454 కేసులు నమోదు
● అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో.. అత్యల్పంగా వనపర్తిలో..
● ఈ ఏడాది కేటుగాళ్లు కొల్లగొట్టింది రూ.9.29 కోట్లు
● గతంతో పోల్చితే కాస్త మెరుగుపడిన రికవరీ
ధని ఇండియా బుల్స్ ఫైనాన్స్ పేరులో ఆన్‌లైన్ లోన్లు మంజూరు చేస్తామని నకిలీ పత్రాలు చూపిస్తూ.. ప్రాసెసింగ్ ఫీజుగా బాధితుడి నుంచి రూ.75,650 వసూలు చేశారు. మోసపోయినట్లు గ్రహించిన తర్వాత బాధితుడు మహబూబ్‌నగర్ టూటౌన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత విచారణ జరిపి నేరస్తులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా.. రాష్ట్రవ్యాప్తంగా 35 కేసుల్లో రూ.3 కోట్లకు పైగా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాలే వేదికగా వల పన్ని దోపిడీకి పాల్పడుతున్నారు. ఆయా వర్గాల వ్యక్తుల బలహీనత అయిన అత్యాశను ఆసరాగా చేసుకుని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. రకరకాల పేర్లతో ఏపీకే లింక్‌లు పంపించి నిలువునా దోచుకుంటున్నారు. ఈ ఏడాది ఎక్కువగా ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట యువత నుంచి భారీగా డబ్బులు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. వారి మాయలో చిక్కుకున్న వారిలో అమాయకులే కాకుండా.. రైతులు మొదలుకొని విద్యాధికులు, రాజకీయ నాయకులు సైతం ఉన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లాను సైబర్ మాయ కమ్మేసిన తీరుపై ‘సాక్షి’ క్రైం రౌండప్..
తీగలాగితే 35 కేసులు..


