ఉత్సాహంగా హ్యాండ్‌బాల్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో శనివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–14 విభాగం హ్యాండ్‌బాల్ బాల, బాలికల ఎంపికలు నిర్వహించారు. ఎంపికలను జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపికై న జట్లు నారాయణపేటలో ఆదివారం నుంచి ఈ నెల 30 వరకు జరిగే ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్–14 హ్యాండ్‌బాల్ టోర్నీలో పాల్గొంటాయని చెప్పారు. రాష్ట్రస్థాయి టోర్నీ లో మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీలు వేణుగోపాల్, రవి, శంకర్, జియావుద్దీన్, ప్రదీప్, జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ రూ.2,881
జడ్చర్ల: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,881, కనిష్టంగా రూ.2,301 ధరలు లభించాయి. అలాగే హంస గరిష్టంగా రూ.1,989, కనిష్టంగా రూ.1,746, కందులు గరిష్టంగా రూ.6,659, కనిష్టంగా రూ.6,189, వేరుశనగ గరిష్టంగా రూ.8,520, కనిష్టంగా రూ.6,515, ఉలువలు రూ.4,001, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,000, కనిష్టంగా రూ.1,777, పత్తి గరిష్టంగా రూ.6,729, కనిష్టంగా రూ.5,010 చొప్పున వచ్చాయి.
ముఖ్యమంత్రివి డైవర్షన్, కరెప్షన్ పాలిటిక్స్
నాగర్‌కర్నూల్: తనవి ఎడ్యుకేషన్, ఇరిగేషన్ పాలిటిక్స్ అని చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డివి డైవర్షన్, కరెప్షన్ పాలిటిక్స్ అని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా శనివారం నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రలో చంద్రబాబు, లోకేష్ వరద నీళ్ల కోసం ప్రాజెక్టులు కడుతున్నామని చెబుతున్నారని, ట్రిబ్యునల్ నీళ్ల కేటాయింపు సమయంలో వరద నీరు పేరుతో కట్టిన వాటికి కూడా నీటిని కేటాయిస్తుందని విమర్శించారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఉంటే మనకి 90 టీఎంసీలపై హక్కు వచ్చేదన్నారు. నల్లమల బిడ్డను అని చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. గురువు చంద్రబాబు కోసం పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు. హరీశ్‌రావు నిర్వాకం వల్లే ఇప్పటికీ కేఎల్‌ఐ ప్రాజెక్టులో మూడు మోటార్లే పనిచేస్తున్నాయని ఆరోపించారు.


