పంచాయతీలకు నిధులు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): నిధులు లేక నీరసించిన పంచాయతీలకు సీఎం రేవంత్‌రెడ్డి తీపి కబురు అందించారు. స్పెషల్ డెవలప్‌మెంట్ నిధులను నేరుగా సర్పంచ్‌లకే అందిస్తామని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షలు చొప్పున విడుదల చేస్తామని సీఎం ప్రకటించడంతో సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 423 గ్రామ పంచాయతీలు ఉండగా.. చాలా గ్రామాలు జీరో బ్యాలెన్స్‌తో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీసం గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇచ్చుకోలేని పరిస్థితి ఉంది. ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సర్పంచులు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం, గ్రామాల్లో చిన్నపాటి పనులు చేపట్టడానికి ఎలా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్న తరుణంలో సీఎం ప్రకటన వారికి ఊరటనిచ్చింది. ఎమ్మెల్యేలకు ఇచ్చిన విధంగానే గ్రామ పంచాయతీలకు సీఎం నిధుల నుంచి స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ ఇవ్వనుండడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు అడుగులు పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
పాలకవర్గాలు లేకపోవడంతో..
గ్రామ పంచాయతీలకు రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల విడుదల నిలిచిపోయింది. దీంతో బాధ్యతలు చేపట్టిన ప్రత్యేకాధికారులు భారంగా నెట్టుకువచ్చారు. చాలా గ్రామాల్లో కార్యదర్శులు సొంత డబ్బులు వెచ్చించి అవసరమైన పనులు చేపట్టారు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో అప్పులు తెచ్చి కార్యదర్శులు పనులు చేపట్టాల్సి వచ్చింది. అలాగే మాజీ సర్పంచులు అడ్వాన్స్‌గా గ్రామాల్లో పనులు చేశారు. వీటికి సంబంధించి మాజీలతోపాటు కార్యదర్శులకు రూ.లక్షల్లో బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎంబీ రికార్డులు చేయించుకుని గ్రాంట్ రాగానే రాబట్టుకునేందుకు మాజీలు జీపీల చుట్టూ తిరుగుతున్నారు. కార్యదర్శులు సైతం అప్పులు తెచ్చిన డబ్బులకు ఎంతకాలం వడ్డీలు కట్టాలని వాపోతున్నారు.
నేరుగా గ్రాంట్లు విడుదల చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి
చిన్న జీపీలకు రూ.5 లక్షలు, పెద్ద జీపీలకు రూ.10 లక్షలు
నూతన సర్పంచ్‌లకు ఊరట
పంచాయతీలకు నిధులు


