జిల్లాలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించి న సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరి కి పదవుల్లో అవకాశం లభిస్తుందన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా పోటీ చేయాలనుకునే వారు జిల్లా పదవులకు దరఖాస్తు చేసుకోవద్దని అభిప్రాయపడ్డారు. ఒకవేళ భవిష్యత్‌లో కార్పొరేటర్‌గా, పార్టీ పదవీపరంగా కూడా పనిచేస్తామనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జిల్లా పరిశీలకులు భాస్కర్ మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన వారికి పదవులు లభిస్తాయన్నారు. పార్టీ పరంగా జిల్లాలో డీసీసీ అధ్యక్షుడిదే తుది నిర్ణయం అన్నారు. పార్టీ లైన్ దాటి, క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడితే ఎవరైనా వేటు తప్పదన్నారు. జిల్లాలోని ప్రతి బ్లాక్‌కు ఒక జిల్లా ఉపాధ్యక్ష పదవి, బ్లాక్‌కు రెండు ప్రధాన కార్యదర్శులు, ప్రతి మండలానికి ఒక కార్యదర్శి, జిల్లా కోశాధికారి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక అధికార ప్రతినిధి, మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రతి 10 డివిజన్‌లకు ఒక ప్రధాన కార్యదర్శి, ఐదు డివిజన్‌లకు ఒక కార్యదర్శి పదవులు ఉంటాయని, ఆసక్తి గలవారు ఈ నెల 29 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 31 లేదా వచ్చేనెల మొదటి వారంలో జిల్లా పార్టీ కార్యవర్గాన్ని ప్రకటించడం జరుగుతుందన్నారు. అలాగే జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ అవేజ్ అహ్మద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో యువతకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నారు. సర్పంచులుగా గెలుపొందిన యువజన కాంగ్రెస్ నాయకులను ఘనంగా సన్మానించారు.


