చిన్న నీటి తరహా వనరుల గణనపై శిక్షణ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఏడో చిన్న నీటి తరహా నీటి వనరుల గణన పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. చిన్న తరహా నీటి వనరుల గణనపై మంగళవారం కలెక్టరేట్‌లో గణకులకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ గణనకు 2023–24 సంవత్సరానికి ప్రామానికంగా పేప ర్ రహితంగా మొబైల్ యందు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా గణన చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్ మాట్లాడుతూ ఈ గణనలో గణకులుగా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, గ్రామ పరిపాలన అధికారులు, ఇతరులను తీసుకొనినవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు నిర్వహించాలన్నారు. గణాంక అధికారి రంగారావు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ హైమావతి, గణాంక అధికారి నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.
సులభతరం చేసేందుకు చర్యలు తీసుకోవాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు ఈ–పాస్‌లో సులభతరంగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని మీసేవ కమిషనర్ రవి కిరణ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయేందిర, సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు స్కాలర్‌షిప్ దరఖాస్తులతో పాటు ఆదాయం, కుల ధ్రువీకరణ, ఇతర ధ్రువపత్రాలు మీసేవలో త్వరగా జారీ చేసేందుకు వేగవంతమైన మార్గాలను అన్వేషించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి అధికారిణి సునీత, ఎస్టీ అభివృద్ధి అధికారి జనార్దన్, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ అధికారిణి ఇందిర, ఈడీఎం చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ రూ.2,821
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 13 వేల క్వింటాళ్ల పంట దిగుబడులు విక్రయానికి వచ్చాయి. 10,500 క్వింటాళ్ల ధాన్యం రాగా ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,821, కనిష్టంగా రూ.1,711 ధరలు లభించాయి. అదేవిధంగా హంస రకానికి గరిష్టంగా రూ.2,025, కనిష్టంగా రూ.1,689, మొక్కజొన్న 2,059 క్వింటాళ్లు రాగా.. గరిష్టంగా రూ.1,974, కనిష్టంగా రూ.1,621 ధరలు పలికాయి. దేవరకద్రలో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,702, కనిష్టంగా రూ.2,119, సోనామసూరి గరిష్టంగా రూ.2,301, కనిష్టంగా రూ.2,055, హంస ధాన్యం రూ.1,869, కనిష్టంగా రూ.1,719న ధరలు నమోదయ్యాయి. దేవరకద్ర మార్కెట్‌కు 5వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.
పనులు వేగవంతంగా పూర్తిచేయాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు కేటాయించాల్సిన ప్లాట్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్, మిషన్ భగీరథ, సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు, అవార్డు అందుకున్న వారందరికీ పునరావాసం కింద 300 గజాల స్థలం, వారి అవసరాలకు ప్రైమరీ హెల్త్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలు, వెటర్నరీ హాస్పిటల్, కమ్యూనిటీ హాల్స్, గ్రామ పంచాయతీ భవనం, పార్కులను, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, ఓవర్ హెడ్ ట్యాంక్, మిషన్ భగీరథ పైపులు వంటి మౌలిక సదుపాయాలు త్వరితగతిన పూర్తయ్యేలా పనులను చేపట్టాలన్నారు. నిర్మాణ పనులను త్వరితగతిన ఎలాంటి అలసత్వం లేకుండా పూర్తి చేయాలన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్, ఆర్డీఓ నవీన్, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
చిన్న నీటి తరహా వనరుల గణనపై శిక్షణ


