మహిళల గౌరవాన్ని పెంచుతున్నాం: యెన్నం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మహిళ అంటే కుటుంబానికి పునాది అని, సమాజానికి దిశానిర్దేశకురాలు..అలాంటి మహిళల జీవితాల్లో ఆత్మగౌరవం, ఆర్థిక స్థిరత్వం, భద్రతను నింపే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో 1,539 మంది మహిళా సంఘాల సభ్యులకు రూ.1,84,39,513 విలువైన వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు. పదేళ్లుగా మహిళా సంఘాలను నిర్లక్ష్యం చేసిన పాలకులు.. వడ్డీలేని రుణాల పంపిణీని నిలిపివేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల సంక్షేమాన్ని ప్రధాన అజెండాగా తీసుకుని వడ్డీలేని రుణాలను పునఃప్రారంభించిందన్నారు. రెండేళ్లుగా జిల్లాలో మహిళలకు రూ.20 కోట్ల మేర రుణాలు అందించామని తెలిపారు. కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం విశిష్ట విధానాలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీఆర్‌డీఓ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్‌చార్జి గోనెల శ్రీనివాసులు, జిల్లా గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు శాంతన్న యాదవ్, ఎంపీడీఓ కరుణశ్రీ, డీడబ్ల్యూఓ జరీనా బేగం, తదితరులు పాల్గొన్నారు.


