
స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థి మృతి
ఇటిక్యాల/శాంతినగర్: ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును రివర్స్ తీయడంతో మంగళవారం సాయంత్రం బాలుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఇటిక్యాల మండలంలోని శనిగపల్లికి చెందిన కుమ్మరి వెంకటేష్, కృష్ణవేణి దంపతుల కుమారుడు వీరేష్ (6) శాంతినగర్‌లోని సరస్వతి పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. మూడు రోజులుగా పాఠశాలకు వెళ్లని వీరేష్ తన అక్క పాఠశాల నుంచి బస్సులో వస్తుందని మంగళవారం సాయంత్రం తల్లి వెంట బస్సు వద్దకు వెళ్లాడు. గ్రామానికి వచ్చిన సరస్వతి పాఠశాల బస్సును రివర్స్ తీసే క్రమంలో డ్రైవర్ అజాగ్రత్త కారణంగా బస్సు వెనక ఉన్న బాలుడికి రక్తగాయాలై, అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన బాలుడి తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు బాలుడి మృతదేహాంతో మంగళవారం రాత్రి శాంతినగర్‌కు చేరుకొని, అలంపూర్–రాయిచూర్ ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా ప్రజాసంఘాల నాయకులు నిలిచారు. విషయం తెలుసుకున్న శాంతినగర్ ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని, ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
పాఠశాల యాజమాన్యం, డ్రైవర్‌పై చర్యలకు డిమాండ్
అలంపూర్–రాయిచూర్ రోడ్డుపై బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన