
మోతెవరి లవ్‌స్టోరీలో అప్పాయిపల్లివాసి
సాక్షి, నాగర్‌కర్నూల్/ లింగాల: ఓటీటీ వేదికగా ఇటీవల విడుదలైన ‘మోతెవరి లవ్‌స్టోరీ’ వెబ్‌సిరీస్‌లో లింగాల మండలం అప్పాయిపల్లికి చెందిన చిరుతల బాలరాజు ముఖ్య పాత్రలో నటించారు. ‘తెలుగు జీ5’ ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలైన ‘మోతెవరి లవ్‌స్టోరీ’ వెబ్‌సిరీస్ వారం రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ వ్యూయర్స్‌ను అందుకుని ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ వెబ్‌సిరీస్‌లో 70 ఏళ్ల వృద్ధుడు రాములు తాత పాత్రలో చిరుతల బాలరాజు మెప్పించారు. లింగాల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి, కొండనాగుల జూనియర్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన బాలరాజు సినిమాలపై మక్కువతో సినీరంగంలో ప్రవేశించారు. పలు సీరియళ్లలో ఆర్టిస్టుగా, కో డైరెక్టర్‌గా పనిచేశారు. అల్లరే అల్లరి, సరదాగా కాసేపు, మిస్సమ్మ, ప్రతిఘటన, ప్రేమ ఎంత మధురం, అత్తో అత్తమ్మ కూతురో తదితర సీరియళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. తాజాగా ఓటీటీలో విడుదలైన మోతెవరి లవ్‌స్టోరీ వెబ్‌సిరీస్‌లో ముఖ్య పాత్ర రాములు తాతగా నటించి అలరించారు. నల్లమలలోని మారుమూల ప్రాంతానికి చెందిన బాలరాజు వెబ్‌సిరీస్‌లో అలరించడంతో గ్రామస్తులు అభినందనలు తెలిపారు.