
కేంద్రం నిధులతోనే అభివృద్ధి పనులు: ఎంపీ
చిన్నచింతకుంట: కేంద్ర ప్రభుత్వం నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం చిన్నచింతకుంటలో వాల్మీకి, ముదిరాజ్ సంఘాల కమ్యూనిటీ భననాల నిర్మాణాలకు భూమి పూజ చేయడంతో పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ కేంద్రం నిధులు లేనిదే రాష్టంలో ఎలాంటి అభివృద్ధి పనులు కొనసాగవని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. గ్రామాల్లో సీసీరోడ్లు, అంగన్‌వాడీలు, శ్మశాన వాటికలు, పీఎం ఆవాస్‌యోజన కింద నిరుపేదలకు ఇళ్లు, మధ్యాహ్న భోజనం, పేదలకు రేషన్, రైతులకు కిసాన్‌సమ్మాన్, ఎరువలపై సబ్సిడీ..తదితర వాటిని అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. పదేళ్ల పాటు బీఆర్‌ఎస్‌తో పాటు ప్రభుత్వం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో చేసింది ఏమీ లేదన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. వారి మోసపూరిత పాలనను ప్రజలు చూస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ఒక్కసారి బీజేపీకి అధికారం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. కేంద్రం నుంచి ప్రతి రూపాయి ప్రజలకు చేరవేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలన్నారు. గ్రామస్థాయి నుంచే పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అందుకు స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేయాలన్నారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని పార్లమెంట్‌లో ప్రతిపాదన పెట్టమని, అందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పద్మజారెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, కొండా ప్రశాంత్‌రెడ్డి, కుర్వ రమేష్, భరత్ భూషన్, నంబిరాజు, బోయ రాము, దశరథ్, తదితరులు పాల్గొన్నారు.