
ఆర్టీసీ ‘స్పెషల్’ బాదుడు
స్టేషన్ మహబూబ్‌నగర్: రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ సంస్థ ప్రత్యేక అదనపు బస్సు సర్వీసులను నడిపింది. ఇదే అదునుగా అదనపు బస్సు సర్వీసుల టికెట్‌పై దాదాపు 30 శాతం చార్జీలు పెంచారు. అయితే చాలామంది ప్రయాణికులకు పెంచిన ధరలు తెలియకపోవడంతో బస్సు ఎక్కిన తర్వాత తీరా టికెట్ తీసుకునే సమయంలో కంగుతింటున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 11 వరకు ప్రత్యేక బస్సు సర్వీసుల్లో అదనపు చార్జీలు వసూలు చేశారు. దీనికితోడు ఒక్కో బస్సులో ఒక్కో రకంగా చార్జీలు తీసుకోవడం గమనార్హం.
అదనపు చార్జీలు ఇలా..
మహబూబ్‌నగర్ టు హైదరాబాద్‌కు సంబంధించి ఎక్స్‌ప్రెస్‌లో గతంలో రూ.160 ఉండగా ఈ మూడు రోజుల్లో రూ.220, డీలక్స్ బస్సులో రూ.190 ఉంటే రూ.250 వరకు తీసుకున్నారు. ఇలా ప్రతి డిపో పరిధిలో రాఖీ పండుగ వేళ నడిపిన ప్రత్యేక అదనపు బస్సు సర్వీసుల్లో అదనపు చార్జీలు తీసుకున్నారు. అయితే భారీ మొత్తంలో అదనపు చార్జీలు తీసుకోవడంపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రతి పండుగకు ప్రత్యేక బస్సులు నడిపి అదనపు చార్జీలు తీసుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
బస్టాండ్లలో పెరిగిన రద్దీ
రెండు రోజుల నుంచి ఆర్టీసీ బస్టాండ్లలో విపరీతమైన రద్దీ పెరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ రూట్‌లోని బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసి రాకపోకలు సాగిస్తుతున్నాయి. బస్సులు ప్లాట్‌ఫాం వద్దకు రాకముందే ప్రయాణికులు ఎగబడి ఎక్కుతున్నారు.
ఈ నెల 9 నుంచి 11 వరకు అదనపు సర్వీసులపై చార్జీల పెంపు
ఒక్కో బస్సులో ఒక్కోరకంగా వసూలు
పెంచిన చార్జీలతో ప్రయాణికుల ఆవేదన