
ఆలయాల అభివృద్ధికి అహర్నిశలు కృషి
జడ్చర్ల: ఆలయాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. సోమవారం బాదేపల్లి పెద్దగుట్టపై శ్రీరంగనాయకస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దగుట్టను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అంతకు ముందు ఆలయ చైర్మన్ రాంరెడ్డి, అర్చకులు ఆయనకు పూర్ణకుంభం, మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం మండలంలోని ఆల్వాన్‌పల్లి గ్రామ సమీపంలో మీనాంబరం వద్ద శ్రీపరుశవేదీశ్వరస్వామి ఆలయ గాలిగోపురం నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఆలయాలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. ప్రతి ఒక్కరు దైవచింతన కలిగి ఉండాలని, మానసిక ప్రశాంతతకు ఆలయాలు చక్కటి ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉపయోగపడతాయన్నారు. ఆలయాల వద్ద భక్తులకు కనీస సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అభివృద్ధి కమిటీలు ఆలయాల పరిరక్షణకు కృషి చేయడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ జ్యోతి, మున్సిపల్ చైర్‌పర్సన్ పుష్పలత, అభివృద్ధి కమిటీ చైర్మన్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.