
రాహుల్‌గాంధీ అరెస్టు రాజ్యాంగ విరుద్ధం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ని అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రంలోని బీజేపీ వచ్చే ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచేందుకు ఎన్నో కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ను అడ్డం పెట్టుకుని ఆ పార్టీ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో లక్షలాది నకిలీ ఓటర్లను సృష్టించిందని ఆరోపించారు. ఇదే విషయాన్ని రాహుల్‌గాంధీ వివిధ ఆధారాలతో సహా నిరూపించడమేగాక న్యాయ పోరాటానికి సైతం సిద్ధమయ్యారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) లను తొలగించి బ్యాలెట్ పేపర్ ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
జాతీయ జెండా ఆడియో పాట ఆవిష్కరణ
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రముఖ కవి, రిటైర్డ్ జీహెచ్‌ఎం దేవదానం రచించిన జాతీయ జెండా పాట సీడీని సోమవారం తన చాంబర్‌లో అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. ఈ పాటకు గన్నోజు నర్సింహాచారి సంగీతం సమకూర్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఓ త్రివర్ణ పతాకమా.. నీవు ఎగురుతుంటే ఆకాశ మే చిన్నబోతోందని పింగలి వెంకయ్య ఎంచుకున్న భావాలకు అనుగుణంగా ఈ పాట ఉందన్నారు. ఈ పాట అందరి మన్ననలు చూరగొని విశేష ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.