రూ.1.45 లక్షలు వసూలుపై కేసు నమోదు
గద్వాల క్రైం: ఓ రైతు అయిదు ఎకరాల వ్యవసాయ పొలాన్ని తన పేరున భూ భారతిలో నమోదు, పాసుబుక్‌ల జారీ కోసం దళారీకి రూ.1.45లక్షలు ఇచ్చి మోసపోయిన ఘటనపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు కథనం మేరకు.. గద్వాల పట్టణానికి చెందిన వెంకటేష్ కేటీదొడ్డి మండలంలోని తన అయిదు ఎకరాల వ్యవసాయ భూమి తన పేరుపై భూ భారతిలో నమోదు, పాసుబుక్‌లు జారీ చేయాల్సిందిగా రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే హైదరాబాద్‌కు చెందిన ఓ దళారీ ఫోన్ ద్వారా పరిచయం చేసుకుని మీ పేరుపై భూభారతిలో పేరు నమోదు చేసి వారం రోజుల వ్యవధిలో పాసుబుక్‌లు జారీ చేస్తామని అందుకు రూ. 5లక్షలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. దళారి మాటలు నమ్మిన వెంకటేష్ ముందుస్తుగా రూ. 1.45 లక్షలను ఏప్రిల్ 26 తేదీన చెల్లించాడు. అయితే నేటి వరకు ఎలాంటి ఫలితం లేకపోవడంతో శనివారం బాధిత రైతు మోసపోయినట్లు గుర్తించి పట్టణ పోలీసుస్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్ తెలిపారు. మోసపూరితమైన వ్యక్తులపై రైతులు ప్రమత్తంగా ఉండాలన్నారు.
97.91 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నారాయణపేట: అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కోటి చందు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు చందు ఇంటి వద్ద బొలేరో వాహనంలో పీడీఎస్ బియ్యాన్ని లోడ్ చేస్తుండగా సివిల్ సప్లయ్ డీటీ కాళప్ప, రూరల్ పోలీస్‌సులు దాడి చేసి వాహనంతో పాటు 97.91 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీటీ పంచనామా చేయగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఎస్‌ఐ గాయత్రి తెలిపారు.
అనారోగ్య సమస్యతో యువతి ఆత్మహత్య
వెల్దండ: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెల్దండ మండలం మర్రిగుంతతండా పంచాయతీ గాజులోనిబావి తండాలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కురుమూర్తి వివరాల మేరకు.. తండాకు చెందిన వడ్యావత్ పద్మ (18) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి భద్రునాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


