రైల్వేస్టేషన్‌కు నల్లా బిల్లు రూ.5.30 లక్షలు!
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఏడాదికోసారి (12 నెలలు కలిపి) నల్లా బిల్లు వసూలు చేయాల్సిన మున్సిపల్ అధికారులు ఏకంగా తొమ్మిదేళ్ల తర్వాత డిమాండ్ నోటీసులిచ్చారు. మహబూబ్‌నగర్‌లోని రైల్వేస్టేషన్ (దక్షిణ మధ్య రైల్వే డివిజన్)కు దశాబ్దాల క్రితమే మున్సిపల్ అధికారులు నల్లా కనెక్షన్ ఇచ్చారు. అక్కడి కార్యాలయంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం తాగునీటి సరఫరా చేస్తున్నారు. ఆ మేరకు ఒకచోట ట్యాంకుతో పాటు మీటరు సైతం బిగించి, 10 కిలో వాటర్‌కు గాను రూ.130 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని రైల్వే అధికారులకు సూచించారు. ఇందుకుగాను 2016 వరకు ఏటా బిల్లు వసూలు చేశారు. ఇదే సంవత్సరంలో అప్పటి మున్సిపాలిటీ సీనియర్ అసిస్టెంట్ మిరాజ్ అలీ అనారోగ్యంతో మృతి చెందారు. ఆ తర్వాత అక్కడికి వెళ్లి మీటరు రీడింగ్ తీసి, బిల్లు వసూలు చేయడం మరిచిపోయారు. ఈ విషయం ఇటీవల ప్రస్తుత ఇంజినీరింగ్ విభాగం (నీటి పన్ను) సీనియర్ అసిస్టెంట్ లక్ష్మయ్య దృష్టికి వచ్చింది. దీంతో ఆయన మూడు రోజుల క్రితమే రైల్వేస్టేషన్‌కు వెళ్లి తొమ్మిదేళ్ల రీడింగ్‌తో పాటు ఎంత మొత్తం రావాలో లెక్కగట్టారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్ రెడ్డికి నివేదించారు. ఆయన ఆదేశాల మేరకు రూ.5,30,023కు డిమాండ్ నోటీసు జారీ చేశారు. ఈ విషయమై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అప్పట్లో నల్లా పన్నుల విభాగాన్ని ఉద్యోగి మిరాజ్ అలీ చూసేవారన్నారు. తొమ్మిదేళ్ల క్రితం ఆయన ఆకస్మిక మృతితో నల్లా కనెక్షన్లకు సంబంధించి కొన్ని ఫైళ్లు అందుబాటులో లేకుండా పోయాయి. ఇటీవల క్షేత్రస్థాయిలో అన్ని కనెక్షన్లను పరిశీలించి ఆన్‌లైన్‌లో పక్కాగా నమోదు చేయిస్తున్నామన్నారు. ఈ తనిఖీలలో భాగంగా స్థానిక రైల్వేస్టేషన్ నల్లా బిల్లు పెండింగ్‌లో ఉన్న విషయం బయట పడిందన్నారు. దీంతో ప్రస్తుతం మరోసారి మొత్తం బిల్లు చెల్లించాలని డిమాండ్ నోటీసు అందజేశామన్నారు. కాగా.. ఈ నెలాఖరు వరకు బిల్లు చెల్లిస్తామని స్థానిక రైల్వే అధికారులు తెలిపారు.
తొమ్మిదేళ్ల తర్వాత
డిమాండ్ నోటీసు అందజేత


