రెండు కుటుంబాల్లో గుండెపోటు విషాదం
దేవరకద్ర: వదిన అంత్యక్రియలకు వెళ్తూ మార్గ మధ్యలో మరదలు మృతి చెందిన ఘటన బుధవారం దేవరకద్ర నియోజకవర్గంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన చాకలి చంద్రమ్మకు (68) రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు. చాకలి చంద్రమ్మ అంతక్రియలను ముచ్చింతలలో చేసేందుకు బంధువులు ఏర్పాట్లు చేశారు. దీంతో మూసాపేట మండలం సంకలమద్దికి చెందిన మృతురాలి మరదలు పేరూర్ నర్సమ్మ (52) అంత్యక్రియలకు హాజరు కావడానికి మరో ఇద్దరు బంధువులతో కలిసి దేవరకద్రకు చేరుకుంది. ముచ్చింతలకు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా అకస్మాత్తుగా నర్సమ్మ కిందపడింది. వెంటనే వైద్య పరీక్షలు చేయించగా అప్పటికే నర్సమ్మ గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిసింది.
ఒక వైపు తల్లి.. మరో వైపు అత్త
దేవరకద్రలో మృతి చెందిన పేరూర్ నర్సమ్మకు ముగ్గురు కుమార్తెలు.. వారిలో శోభారాణి అనే కుమార్తెను ముచ్చింతలలోని చాకలి చంద్రమ్మ కొడుకుకు ఇచ్చి వివాహం చేశారు. అయితే అత్త చాకలి చంద్రమ్మ శవంతో అంబులెన్స్‌లో స్వగ్రామానికి వస్తున్న శోభారాణికి తన తల్లి నర్సమ్మ దేవరకద్ర బస్టాండ్‌లో మృతి చెందిన విషయం తెలిసింది. ఒక వైపు అత్త అప్పటికే మృతి చెందగా.. ఇప్పుడు తల్లి మృతి చెందడంతో శోభారాణి పరిస్థితి దయనీయంగా మారింది. గురువారం ముచ్చింతలలో చాకలి చంద్రమ్మ, సంకలమద్దిలో పేరూర్ నర్సమ్మ అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు బంధువులు తెలిపారు.
వదిన అంత్యక్రియలకు వెళ్తూ
మరదలు మృతి
రెండు కుటుంబాల్లో గుండెపోటు విషాదం


