పాలమూరు: పలు రకాల కేసుల్లో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు పూర్తిగా సత్ప్రవర్తనతో మెలగాల్సిన అవసరం ఉందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని జిల్లా ప్రధాన జైలును బుధవారం న్యాయమూర్తి సందర్శించారు. మొదటగా ఖైదీలకు తయారు చేసే ఆహారం, వంట గది, ఖైదీలు ఉండే బ్యారక్‌లను పరిశీలించారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ పనితీరును జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు అందుతున్న వసతులపై ప్రత్యేకంగా ఆరా తీశారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ జైలు జీవితం తర్వాత ఎలాంటి తప్పులు చేయకుండా కుటుంబం కోసం ఉత్తమ జీవనం సాగించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర, జైలు సూపరింటెండెంట్ వెంకటేశం, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ రవీందర్, సభ్యులు యోగేశ్వర్‌రాజ్, మల్లారెడ్డి, శివరాజ్, యాదయ్య పాల్గొన్నారు.
రైల్వే ప్రైవేటీకరణకువ్యతిరేకంగా పోరాడుదాం
జడ్చర్ల టౌన్: రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి పిలుపునిచ్చారు. బుధవారం జడ్చర్ల రైల్వేస్టేషన్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రైల్వేలో భద్రత చర్యలు పెంచాలని, ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులు పోరాటానికి ముందుకు రావాలన్నారు. రైల్వేలో ఖాళీగా ఉన్న దాదాపు 5లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ప్యాసింజర్ రైళ్లను పెంచాలని, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్‌క్లాస్, జనరల్ కంపార్ట్‌మెంట్‌లను పెంచాలన్నారు. ఎంతో ప్రాధా న్యత కలిగిన రైల్వే వ్యవస్థను కేంద్రం ప్రైవేటీకరించటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని, అందరం వ్యతిరేకించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఖమర్ అలి, తెలు గు సత్తయ్య, మున్నాబాయ్, కృష్ణ, సాగర్, మహేష్, పుల్లయ్య, రాంసింగ్, విజయేంద్ర యాదవ్, సురేంద్రసింగ్ పాల్గొన్నారు.
నిలకడగా ఉల్లి ధరలు
● గరిష్టంగా రూ. 1450
● కనిష్టంగా రూ. 950
దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు నిలకడగా ఉన్నాయి. ఉల్లి సీజన్ తగ్గు ముఖం పట్టడంతో మార్కెట్‌కు వేయి బస్తాల వరకు ఉల్లి అమ్మకానికి వచ్చింది. బహిరంగ వేలంలో క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.1450, కనిష్టంగా రూ.950 గా ధరలు నమోదయ్యాయి. గరిష్ట ధర పలికిన ఉల్లి 50 కేజీల బస్తా ధర రూ.800ల వరకు విక్రయించారు. అయితే వేలం ధర కన్నా బస్తా పై రూ.75 వరకు వ్యాపారులు ఎక్కువగా తీసుకున్నారు. కనిష్టంగా బస్తా ధర రూ.500 వరకు విక్రయించారు. మార్కెట్ బయట పలువురు రైతులు ట్రాక్టర్‌లపై తెచ్చిన ఉల్లి బస్తాలను నేరుగా విక్రయించారు. రూ.800 నుంచి రూ.700 వరకు బస్తాగా అమ్ముకున్నారు.
ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర రూ.2,103
దేవరకద్ర/నవాబుపేట: దేవరకద్ర మార్కెట్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,103, కనిష్టంగా రూ.1,792గా ధరలు పలికాయి. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,804, కనిష్టంగా రూ.1,640గా ధరలు నమోదయ్యాయి. ఆముదాల ధర గరిష్టంగా రూ.5,859గా ఒకే ధర లభించింది. మార్కెట్‌కు దాదాపు 5 వందల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. నవాబుపేట మార్కెట్‌కు ఆర్‌ఎన్‌ఆర్, జేజేలు (1010)లు కలిసి దాదాపు పదివేల ఽబస్తాల ధాన్యం వచ్చింది. వరి (1010) రకం 2,613 బస్తాలు రాగా వాటికి సగటున రూ.2,383 ధర వచ్చింది. అలాగే ఆర్‌ఎన్‌ఆర్ 7,283 బస్తాలు రాగా గరిష్టంగా రూ.2,384, కనిష్టంగా రూ.1,860 ధర పలికింది.
జైలులో సత్ప్రవర్తనతో ఉండాలి


