
భూములను కాపాడేందుకే భూభారతి చట్టం
గండేడ్/మహమ్మదాబాద్: పేద రైతుల భూములను కాపాడేందుకే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. శనివారం గండేడ్ మండల పరిధిలోని వెన్నాచేడ్, మహమ్మదాబాద్ మండలపరిధిలోని నంచర్ల పల్లవి ఆడిటోరియంలో రైతులకు అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను ఎంతో మోసం చేసి కోర్టుల చుట్టూ తిరిగేలా చేశారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ధరణిని బంగాళాఖాతంలో పడేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు సూచించారు. ఇలాంటి చట్టంతో ఎంతో మంది రైతుల సమస్యలు తీరుతాయని తెలిపారు. ఇది ప్రజా ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని రైతులు సంతోషంగా ఉండాలన్నదే సీఎం లక్ష్యమని తెలిపారు. ఉమ్మడి గండేడ్ మండలంలో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యలో వెనుకబడిన మన ప్రాంతం విద్యలో ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉన్నదన్నారు.
భూమికి సురక్షితమైన హక్కు భూభారతి
పేద రైతుల భూములకు సురక్షితమైన హక్కులు కల్పించేది భూభారతి చట్టమని కలెక్టర్ విజయేందిర అన్నారు. భూమి ఉన్న ప్రతి రైతుకు భూధార్ కార్డు ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమస్యలు ఉన్న రైతులు మండల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకుంటే సమస్య పరిష్కారం కాకుంటే ఆర్డీఓకు అప్పీలు చేయవచ్చని, అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్ దగ్గర అర్జీ పెట్టుకోవచ్చన్నారు. భూసమస్యలతో రైతులు మహిళలు కోర్టుల చుట్టూ తిరుగకుండా భూబారతి చట్టం ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా వెన్నాచేడ్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ రైతులకు తాగునీరు, నీడ కనీస సౌకర్యాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఓ రైస్‌మిల్లుకు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న 6 ట్రాక్టర్లను పట్టుకుని స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, ఆర్డీఓ నవీన్‌కుమార్, తహసీల్దార్లు నాగలక్ష్మి, తిరుపతయ్య, ఎంపీడీఓలు దేవన్న, నరేందర్‌రెడ్డి, నాయకులు జితేందర్‌రెడ్డి, కేఎం నారాయణ, రాములు, విష్ణువర్ధన్‌రెడ్డి, పుల్లారెడ్డి, శాంతీబాయి, రాధారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.