హజ్ యాత్రికులు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: హజ్‌యాత్రికులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ గులాం అఫ్జల్ బియాబాని అన్నారు. జిల్లాకేంద్రంలోని వైట్ హౌజ్ కన్వెన్షన్‌లో జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం హజ్‌యాత్రికులకు మెగా డిజిటల్ ట్రైనింగ్ క్యాంపు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కమిటీ చైర్మన్ మాట్లాడుతూ మన దగ్గర వాతావరణానికి, అక్కడి వాతావరణానికి ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. అక్కడ ఎండలు మన కంటే ఎక్కువగా ఉన్నాయని, హజ్‌యాత్రికులు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హజ్‌యాత్రలో ఎక్కువగా నడవాల్సి వస్తుందని, అందువల్ల యాత్రికులు ఈ సమయంలో ఎక్కువగా నడవడానికి ప్రాక్టీస్ చేయాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి హజ్ హౌస్, ఉర్దూఘర్ నిర్మాణానికి నిధులు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ హజ్‌యాత్రికులు ప్రజల క్షేమం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం దువా చేయాలన్నారు. జిల్లా హజ్ సొసైటీ రూపొందించిన హజ్‌యాత్ర గైడ్‌లను చైర్మన్లు ఆవిష్కరించారు. ఢిల్లీకి చెందిన మోనిస్‌ఖాన్ డిజిటల్ ట్రైనింగ్ నిర్వహించగా మౌలానా తస్లీం అన్సారీ, ముఫ్తి ఆసిఫ్, ఖలీల్ అహ్మద్ హజ్‌యాత్రపై శిక్షణ అందజేశారు. ఎస్‌హెచ్‌సీ ఎగ్జిక్యూటివ్ అధికారులు మహ్మద్ సజ్జాద్ అలీ, ఇర్ఫాన్ షరీఫ్, జిల్లా హజ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు మహమూద్ అలీ, ఎండీ మేరాజుద్దీన్, రవూఫ్‌పాష, సత్తార్, సులేమాన్, యూసుఫ్, సుల్తాన్, ఫైజొద్దీన్ పాల్గొన్నారు.
రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్
అఫ్జల్ బియాబాని


