భూత్పూర్: జిల్లాలో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వర్షంతో దెబ్బతిన్న వరిపంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ అన్నారు. సోమవారం మండలంలోని మద్దిగట్ల, కర్వెన గ్రామాల్లో వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న వరిపంటను దేవరకద్ర ఏడీఏ యశ్వంత్‌రావు, తహసీల్దార్ జయలక్ష్మి, ఏఓ మురళీధర్‌తో కలిసి డీఏఓ పరిశీలించారు. రెండు గ్రామాల్లో 882 మంది రైతులకు సంబంధించి 1,476 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, అలాగే 65 ఎకరాల్లో మొక్క జొన్నకు సైతం నష్టం జరిగిందని డీఏఓ తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఏఈఓలు మౌనిక, ఆనందస్వామి, రైతులు పాల్గొన్నారు.
నష్టపరిహారం అందించాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లావ్యాప్తంగా అకాల వర్షాలతో సుమారు 2 వేల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలకు నిధులు పెంచి సత్వరమే పూర్తి చేయాలన్నారు. అలాగే పార్టీ ఏర్పడి వందేళ్లు అవుతున్నందున జిల్లా, మండల, గ్రామస్థాయిలో జెండా ఆవిష్కరణలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో నాయకులు బాలకిషన్, పరమేష్‌గౌడ్, అల్వాల్‌రెడ్డి, సురేష్, రాము, చాంద్‌పాషా, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.