అభ్యంతరాలు పరిశీలించి.. పరిష్కరిస్తాం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మున్సిపల్ వార్డు ల వారీగా ఈనెల 1న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా పై వచ్చిన అభ్యంతరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితాపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు మహబూబ్‌నగర్ నగర పాలక సంస్థలో 144, భూత్పూర్ మున్సిపాలిటీలో 88, దేవరకద్ర మున్సిపాలిటీలో 9 అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. ముఖ్యంగా ఒక వార్డులో ఉన్న ఓటర్లు మరో వార్డులో రావడం, కుటుంబ సభ్యులకు వేర్వేరు పోలింగ్ కేంద్రాలలో ఓట్లు రావడం, ఒక కాలనీ ఓటర్లు రెండు మూడు పోలింగ్ కేంద్రాలలో ఉండడం వంటి వాటిపై అభ్యంతరాలు ఉన్నట్లు రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలిపారు. వార్డు వారీగా ప్రచురించిన ఓటరు జాబితాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పునఃపరిశీలన చేస్తున్నామని, రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ తెలిపారు. వీటన్నింటినీ ఈ నెల 9లోగా పరిశీలించి 10న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని, అంతలోపు ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీలు తెలియజేయాలని కోరారు. ఎలాంటి తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆమె కోరారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ మాట్లాడుతూ ఈనెల 1న మున్సిపాలిటీలలో ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించడం జరిగిందని, అభ్యంతరాల స్వీకరణకై మున్సిపాలిటీలలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి, అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, ముసాయిదా జాబితా ముందే అన్ని రాజకీయ పార్టీలకు అందచేయాలని కోరారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, బీజేపీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఇతర పార్టీ నాయకులు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.
తప్పులు లేకుండా ఓటరు జాబితాను రూపొందిస్తాం
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం
అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి
కలెక్టర్ విజయేందిర బోయి


