జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): కూలి పనులు చేసుకునే నిరుపేదలే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులు. ఉపాధి హామీ కూలీలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రభుత్వం’ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’కి శ్రీకారం చుట్టింది. ఏడాదికి రెండు విడతల్లో నిధులు జమ చేయనుంది. మొదటి విడతలో భాగంగా కూలీల కుటుంబాలకు రూ.6 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 423 గ్రామ పంచాయతీల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 5,74,26,000 మంజూరు చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా 9571 మంది ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు లబ్ధి చేకూరింది.
వీరికే ఆత్మీయ భరోసా
● భూమి లేని రైతులు, వ్యవసాయ కార్మికులకే పథకం వర్తిస్తుంది.
● 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజుల పని పూర్తిచేసిన ఉపాధి హామీ కూలీలు అర్హులు.
● ధరణి పోర్టల్లో ఒక్క గుంట కూడా భూమి లేని నిరుపేదలు.
● ప్రభుత్వం నుంచి వచ్చిన జాబితా ప్రకారం గ్రామ సభలు నిర్వహించారు. అర్హుల జాబి తాను ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించి, లబ్ధిదారులను గుర్తించారు.
ఒక్కో కుటుంబానికి రూ.6 వేలు
లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ
9, 571 కుటుంబాలకు లబ్ధి
‘ఆత్మీయ భరోసా’ రూ.5,74,26,000 మంజూరు
నిరుపేదలకే ‘భరోసా’