మహిళా శక్తి, ఉగాది పురస్కారాలు ప్రదానం
స్టేషన్ మహబూబ్‌నగర్: పాలమూరు తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్‌కు చెందిన ప్రమీల శక్తిపీఠం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని భారత్ స్కౌట్స్, గైడ్స్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య మసన చెన్నప్ప మాట్లాడుతూ మహిళలు పురుషులతో పోటీపడుతూ సాహిత్యరంగంలో చేస్తున్న కృషిని అభినందించారు. తెలంగాణ సాహిత్య కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి మాట్లాడుతూ మహిళలు సాహిత్య సాంస్కృతిక సంస్థను స్థాపించి సాహిత్య కార్యక్రమాలు చేపడుతూ వివిధ రంగాల్లో కృషి చేస్తున్న మహిళలకు మహిళా శక్తి పురస్కారాలు, ప్రముఖ సాహితీవేత్తలకు ఉగాది పురస్కారాలు అందజేస్తుండటం అభినందనీయమని అన్నారు. పద్యకవి డాక్టర్ కె.బాలస్వామి రచించిన ‘నమో శిల్పి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమాజ సేవకురాలు డాక్టర్ లక్కరాజు నిర్మల, పద్య కవయిత్రి సుజాత, ప్రముఖ చిత్రకారిణి గుమ్మన్నగారి బాల సరస్వతిలకు మహిళాశక్తి పురస్కారాలు అందజేశారు. పటేల్ మాడ లక్ష్మిదేవమ్మ స్మారక పురస్కారాన్ని ప్రముఖ గాయని జి.చంద్రకళకు అందజేశారు. శ్రీవిశ్వావసునామ ఉగాది పురస్కారాలను డాక్టర్ నామోజు బాలాచారి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాలరాజు యాదవ్, ప్రముఖ పద్యకవి డాక్టర్ బాలస్వామిలకు అందజేశారు. కార్యక్రమంలో మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి, చుక్కాయపల్లి శ్రీదేవి, కవులు పాల్గొన్నారు.


