పేదలకు అందని బియ్యం | - | Sakshi
Sakshi News home page

పేదలకు అందని బియ్యం

Mar 20 2025 1:03 AM | Updated on Mar 20 2025 1:02 AM

మహబూబ్‌నగర్‌ రూరల్‌: పేదలకు ప్రభుత్వం అందిస్తున్న బియ్యం క్షేత్రస్థాయిలో వచ్చేసరికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. ప్రతి నెల ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పట్టణాలు, గ్రామాల్లో ఉన్న రేషన్‌షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం బియ్యంతో పాటు తొమ్మిది రకాల సరుకులను రేషన్‌ షాపుల ద్వారా సబ్సిడీపై అందించేవారు. అన్ని నిత్యావసర సరుకులు పోగా.. ఇప్పుడు కేవలం బియ్యం మాత్రమే మిగిలింది. ప్రతి నెల రెండు, మూడు రోజులు ఆలస్యమైనా బియ్యం సరఫరా చేసేవారు. సంక్రాంతికి సన్న బియ్యం సరఫరా చేస్తామన్న ప్రభుత్వ హామీ దేవుడెరుగు.. ఈనెల 19వ తేదీ వచ్చినా కనీసం దొడ్డు బియ్యం కూడా సరఫరా కాకపోవడం జిల్లాలో పేదలకు శాపంగా మారింది. సన్నాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు దొడ్డు బియ్యం కూడా రాకపోవడంతో తీవ్ర అయోమయంలో పడ్డారు. బియ్యం ఎప్పుడిస్తారోనని సంచులు పట్టుకొని రేషన్‌షాపుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయంలో నేడో.. రేపో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

● వానాకాలం, యాసంగి సీజన్‌లలో రైతుల నుంచి సేకరించిన సన్న ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి పేదలకు సన్న బియ్యంగా పంపిణీ చేస్తామని స్వయంగా రాష్ట్ర పౌర సరఫరాలశాఖ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. అయితే ఇక్కడ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. సన్న బియ్యంపై డైలమా నెలకొంది. ప్రతి నెల 1వ తేదీ నుంచి బియ్యం కేటాయింపు ఉంటుంది. పౌర సరఫరాల సంస్థ కేటాయింపులు విధించగానే రేషన్‌షాపులకు బియ్యం స్టాక్‌ వెళ్తుంది. ప్రతి నెల 1వ తేదీలోపే జిల్లాలోని మూడు రేషన్‌ బియ్యం స్టాక్‌ పాయింట్ల నుంచి పట్టణాలు, గ్రామాల్లోని 506 రేషన్‌షాపులకు బియ్యం చేరాల్సి ఉండగా.. ఇప్పటి వరకు జిల్లాలో 70 శాతం మాత్రమే బియ్యం చేరుకుంది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి దుకాణాలకు బియ్యం సరఫరా కావాలి. అయితే 1వ తేదీ తర్వాత కేటాయింపు ఇవ్వడంతో రేషన్‌ బియ్యం పేదలకు అందకుండా సమస్యగా మారింది. జిల్లాలో 4,423 మెట్రిక్‌ టన్నులు కేటాయింపులకు ఇప్పటివరకు 3,900 మెట్రిక్‌ టన్నులు పంపిణీ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి 70 శాతం మాత్రమే పంపిణీ జరిగిందని తెలుస్తుంది.

● ప్రతి ఏడాది వానాకాలం, యాసంగి సీజన్‌లలో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి పేదలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే సీఎంఆర్‌ విషయంలో మిల్లర్లు తీసుకున్న వడ్లను బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అప్పగించే విషయంలో మిల్లర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఏయే మిల్లులకు ఎంతంత కేటాయింపులు చేస్తున్నారు. తిరిగి వారు ఎప్పుడు బియ్యాన్ని అప్పగిస్తున్నారు. టార్గెట్‌లు ఏ మేరకు ఉన్నాయి అని అధికారులను అడిగితే వారు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారు. గోడౌన్‌ల కెపాసిటిని బట్టి అలాట్‌మెంట్‌ చేశామని పైకి అధికారులు చెబుతున్నప్పటికీ.. వాస్తవానికి వీరు రైస్‌ మిల్లర్లతో కుమ్మక్కు కావడం వల్ల సమయానికి సీఎంఆర్‌ రైస్‌ అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్య ఏర్పడిందంటే ఇందుకు కారణం రేషన్‌షాపుల డీలర్లతో అధికారులు కుమ్మక్కు కావడమేనని పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు. మార్చి నెల ఇంకా పేదలకు బియ్యం అందలేదు. నేడో.. రేపో పరిస్థితి చక్కబడుతుందని అధికారులు అంటున్నారు. అలాట్‌మెంట్‌ ప్రకారం బియ్యం తీసుకెళ్తున్న డీలర్లు అందరికీ బియ్యం పంపిణీ చేస్తారా.. లేక గుట్టుచప్పుడు కాకుండా మాయం చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పౌర సరఫరాల సంస్థ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారుల మధ్య ఉన్న చీకటి ఒప్పందం కారణంగా రైస్‌ మిల్లర్లు రేషన్‌ షాపుల డీలర్లు పేదల బియ్యాన్ని పెద్దల పాలు చేస్తున్నారు.

సాంకేతిక సమస్య సాకుగా...

మార్చి నెల పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యం సకాలంలో అందకపోవడం గల కారణాలను సాంకేతిక సాకుగా చూపిస్తున్నారు అధికారులు. వారి తప్పిదం వల్ల ఆలస్యం జరిగిందా లేక సీఎంఆర్‌ చెల్లింపుల్లో మిల్లర్లు మాయజాలం వల్ల ఇబ్బంది కలిగిందా అనేది విచారణలో తేలనుంది.

సీఎంఆర్‌ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్న మిల్లర్లు

అధికారుల మిలాఖత్‌ కారణమా..?

సన్నబియ్యం దేవుడెరుగు.. ఇచ్చే బియ్యం సంగతేంటి

నేటికీ 30 శాతం పేదలకు అందని బియ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement