నిధులు వచ్చేనా.. పనులు సాగేనా? | - | Sakshi
Sakshi News home page

నిధులు వచ్చేనా.. పనులు సాగేనా?

Mar 19 2025 12:30 AM | Updated on Mar 19 2025 12:29 AM

గద్వాల: వలసలకు మారుపేరైన పాలమూరు వరుస మార్చాలనే తలంపుతో అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ఐదేళ్ల పాలనలో దాదాపు పనులన్నీ 70– 80 శాతం వరకు పూర్తయ్యాయి. ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న రాజశేఖరరెడ్డి మరణం, వరదలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం వంటి పరిణామాలతో ఆయా ప్రాజెక్టు పనుల గమనానికి అడ్డంకిగా మారాయి. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గడిచిన రెండు దశాబ్దాలుగా జలయజ్ఞం ప్రాజెక్టులు పెండింగ్‌లోనే కొనసాగుతున్న దుస్థితి. ఈ నేపథ్యంలో పాలమూరు వాసి అయిన సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంపై పెద్దఎత్తున ఆశలు నెలకొన్నాయి. పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధుల వరద పారి పంట పొలాలకు సాగునీరు అందుతుందనే అన్నదాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు.

రెండు దశాబ్దాలుగా..

గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల పరిధిలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2005లో చేపట్టిన నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 90 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పనులకు నిధుల లేమి ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ పనులు పూర్తి చేయాలంటే రూ.231.36 కోట్లు అవసరం. వీటిని విడుదల చేస్తే రెండేళ్లలో పెండింగ్‌ పనులు పూర్తయ్యి నడిగడ్డలో కొత్తగా 58 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది.

ర్యాలంపాడుకు మరమ్మతు..

నెట్టెంపాడు ప్రాజెక్టులో గుండెకాయగా చెప్పుకొనే ర్యాలంపాడు రిజర్వాయర్‌కు లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో 4 టీఎంసీల సామర్థ్యం గల జలాశయంలో ప్రస్తుతం 2 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసుకునే పరిస్థితి. దీని మరమ్మతుకు సంబంధించి సర్వే ప్రక్రియ పూర్తి చేసి సుమారు రూ.137 కోట్ల అంచనాతో నివేదిక ప్రభుత్వానికి పంపారు. దీని మరమ్మతుకు అవసరమైన నిధుల కేటాయింపుపై రైతన్నలు ఆశలు పెట్టుకున్నారు.

● రెండేళ్ల కిందట రూ.581 కోట్లతో చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకం కింద కేటీదొడ్డి, గట్టు మండలాల్లో కొత్తగా 33వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టారు. ప్రస్తుతం ప్రాజెక్టు కింద 40 శాతం పనులు పూర్తికాగా మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రస్తుతం రూ.285.19 కోట్లు అవసరం ఉన్నట్లు అధికారులు నివేదిక పంపారు.

● ఆర్డీఎస్‌ ప్రాజెక్టులో భాగంగా తుంగభద్ర నది నుంచి నీటిని ఎత్తిపోసి 87,500 ఎకరాలకు అందించేలా రూ.1,197.77 కోట్లతో ఎనిమిదేళ్ల కింద తుమ్మిళ్ల లిఫ్టు చేపట్టారు. ఇందులో రూ.629.26 కోట్ల పనులు పూర్తి కాగా.. మిగిలిన పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

సంగంబండ సైతం..

2003లో మక్తల్‌ మండలం చిన్నగోప్లాపూర్‌ దగ్గర కాల్వ పనులు ప్రారంభించారు. 2004లో జలయజ్ఞం భీమా ఫేజ్‌–1, ఫేజ్‌–2లకు జీఓ నం.166 విడుదల చేయగా రూ.1,426 కోట్ల నిధులు మంజూరు చేశారు. అయితే కాల్వల పనులు సక్రమంగా చేపట్టకపోవడంతో.. 2017లో మళ్లీ రూ.2,500 కోట్లు మంజూరు చేశారు. ఈ రెండు రిజర్వాయర్ల కింద పనులు దాదాపు 90 శాతం పూర్తి చేశారు. అయితే పొలాలకు సాగునీరందించేందుకు పిల్ల కాల్వలు పూర్తి కాకపోవడంతో మెయిన్‌ కెనాళ్ల ద్వారా చెరువులు నింపుతున్నారు.

కోయిల్‌సాగర్‌ది అదే దారి..

కోయిల్‌సాగర్‌ కుడి, ఎడమ కాల్వల మరమ్మతు, డిస్ట్రిబ్యూటరీ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇంకా సుమారు రూ.89.9 కోట్ల పనులు చేపట్టాల్సి ఉంది. కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల కింద నాగిరెడ్డిపల్లి పంప్‌హౌస్‌ వద్ద రూ.19.68 కోట్లు, తీలేరు పంప్‌హౌస్‌ వద్ద రూ.19.62 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. కోయిల్‌సాగర్‌ బ్యాక్‌వాటర్‌ నుంచి తవ్విన దేవరకద్ర గ్రావిటీ కెనాల్‌ చౌదర్‌పల్లి నుంచి లక్ష్మిపల్లి వరకు రూ.21 కోట్ల విలువైన పనులు పెండింగ్‌ ఉన్నాయి. డిస్ట్రిబ్యూటరీ కాల్వల కింద, గ్రావిటీ కెనాల్‌ పరిధిలో, ఎడమ కాల్వ పొడిగింపు పనులకు గాను సేకరించిన భూములకు సంబంధించి ఇంకా 347 ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది.

ఉమ్మడి జిల్లాలో అసంపూర్తిగా ప్రాజెక్టుల నిర్మాణాలు

గత ప్రభుత్వ హయాంలో నిధుల కొరతతో ముందుకు సాగని వైనం

తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాపై కరుణ చూపేనా

పెండింగ్‌ పనులు పూర్తయితేనే పాలమూరు సస్యశ్యామలం

నేడు రాష్ట్ర బడ్జెట్‌ నేపథ్యంలో జిల్లా రైతాంగం ఆశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement