● ప్రజా సమస్యలపై సీపీఎం సర్వే
మహబూబ్‌నగర్ రూరల్: సీపీఎం చేసిన పోరాటాల ఫలితంగా ప్రభుత్వం 310 డబుల్ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేసిందని, కానీ నేటికీ ఇళ్ల యజమానులకు పట్టాలు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం చూపుతోందని ఆ పార్టీ పట్టణ కార్యదర్శి చంద్రకాంత్ ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం క్రిష్టియన్‌పల్లి రెవెన్యూ వార్డు శివారులో గల డబుల్ బెడ్‌రూం కాలనీలో సర్వే నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో సమస్యలు ఉన్నాయని, రేషన్ కార్డులు, గ్యాస్ సిలిండర్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అర్హులకు అమలు కావడం లేదన్నారు. ఆరు గ్యారెంటీలు అమలయ్యేదాకా అనేక రకాల పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. నాయకులు రాజ్‌కుమార్, అనురాధ, మాణిక్‌రావు, నర్సింగ్‌రావు, కొండమ్మ పాల్గొన్నారు.


