సమయం.. సరిపోవట్లే! రోజుకు 28గంటలు ఉంటే బాగుండు! | Sakshi
Sakshi News home page

సమయం.. సరిపోవట్లే! రోజుకు 28గంటలు ఉంటే బాగుండు!

Published Mon, Nov 27 2023 1:10 AM

- - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: ‘ప్రచారంలో అటు తిరిగి ఇటు వచ్చే లోగా రోజు గడిచిపోతుంది. ఏ రోజు అనుకున్న పనులు ఆ రోజు అవట్లేదు. సమయం సరిపోవడం లేదు. పోలింగ్‌ సమయమేమో దగ్గరపడుతోంది. రోజుకు 28గంటలు ఉంటే బాగుండు.’ ఇటీవల ఓ నాయకుడు తన అనుచరుల వద్ద చేసిన వ్యాఖ్య ఇది.

ఈ ఒకట్రెండు రోజులు చెమటోడ్చి కష్టపడితే ఐదేళ్ల పాటు హాయిగా వీఐపీ హోదాలో దర్జాగా ఉండవచ్చు. శాసనసభలో ప్రధాన ప్రాత వహిస్తూ అధికార దర్పంతో హాయిగా బతకవచ్చు. కాలం కలిసి వస్తే మంత్రి పదవి రావొచ్చు. అలాంటి రాజకీయ జీవితం కోసం అభ్యర్థులు ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఓవైపు ఉష్ణోగ్రతలు పడిపోయి గ్రామాలన్నీ మంచుదప్పటి పరచుకుని ఉంటే.. అభ్యర్థులు చలిని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజామునే ప్రచారం మొదలుపెడుతున్నారు. ఉదయం ఇంటి నుంచి బయల్దేరి రాత్రికి ఎప్పుడో తిరిగొస్తున్నారు. అభ్యర్థుల దినచర్య అత్యంత బిజీ షెడ్యూల్‌తో ప్రారంభమవుతోంది. అలసట, విశ్రాంతి అనే పదాలకు చోటులేకుండా ముందుకు సాగుతున్నారు.

సహాయకుల పరిస్థితి అంతే..
ఒక్క నిమిషం కూడా వృథా కాకుండా అభ్యర్థులు తమ షెడ్యూల్‌ను జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటున్నారు. కేవలం నిద్రించే సమయం తప్ప మిగతా సమయాన్ని మొత్తం ప్రచార పర్వానికే అంకితం చేస్తున్నారు. కాలంతో పరుగెడుతూ ఎన్నికల కుస్తీ పడుతున్నారు. బిజీ షెడ్యూల్‌తో అభ్యర్థులకు నెలరోజుల నుంచి కంటినిండ నిద్ర కరువైంది. గ్రామీణ ప్రజలు ఉదయమే వ్యవసాయ పనులకు వెళ్తుండటంతో వారిని కలిసేందుకు వీలైనంత త్వరగా ఇంటి నుంచి బయల్దేరుతున్నారు.

ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వేలాది మందిని ప్రత్యక్షంగా పలకరిస్తున్నారు. ఈ సమయంలో వారి వ్యక్తిగత సహాయకుల పాత్ర కీలకమవుతుంది. నిర్దేశించుకున్న పనులను నిర్ణీత సమయానికి గుర్తు చేయడం, అందరినీ సయన్వయం చేయడం వంటి బాధ్యతలు వీరు నిర్వరిస్తున్నారు. అలా అభ్యర్థులకు సహకారం అందిస్తూ సమయాభావ సమస్యను ఎదుర్కొంటున్నారు.

నెలరోజులుగా జనంలోనే..
అభ్యర్థుల ఇళ్ల వద్ద నిత్యం జనంతో కోలహలం కనిపిస్తోంది. ఉదయం నుంచే వందలాది మంది నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీల అభ్యర్థులతో మాట్లాడేందుకు క్యూ కడుతున్నారు. దీంతో నిద్రలేచింది మొదలు ప్రచారతంతు ప్రారంభమవుతోంది. కిందిస్థాయి నేతలతో మాట్లాడుతూ గ్రామాలు, మండలాల్లో పరిస్థితిపై ఆరా తీసేందుకు కొంత సయమం కేటాయించాల్సి వస్తోంది. రోజు ఏదో ఒక చోటకు వెళ్లడం దిన చర్యలో తప్పనిసరిగా మారింది.

నియోజకవర్గం మొత్తం చుట్టి రావడమే లక్ష్యంగా రోజువారీ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాలకు రాకపోకల సమయంలోనూ ముఖ్యనేతలతో ఎప్పటికప్పుడు పరిస్థితులపై చర్చిస్తున్నారు. అలాగే ప్రత్యర్థి పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించేందుకు స్థానిక లీడర్ల సాయంతో కొంత సమయం కేటాయిస్తున్నారు. నియోజకవర్గానికి ఎవరైనా ముఖ్యనేతలు వస్తే జనసమీకరణ తదితర ఏర్పాట్లు చూసుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం రోజులో ఎంతో కొంత సమయం కేటాయిస్తున్నారు.

దిన చర్య ఇలా..
► ఉదయం 5గంటలకు మేల్కొనడం
► 5నుంచి 6గంటల వరకు కాలకృత్యాలు తీర్చుకోవడం
► 6నుంచి 7లోగా స్నానం, టిఫిన్‌ చేయడం
► 7నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు గ్రామాల్లో ప్రచారం, రోడ్‌ షోలు, చేరికలు, సభలు, ప్రెస్‌మీట్‌లు నిర్వహించడం
► 2నుంచి 4గంటల మధ్య మధ్నాహ్న భోజనం చేయడం
► సాయంత్రం 4నుంచి రాత్రి 10గంటల వరకు సభలు, సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొనడం
► రాత్రి 10గంటలకు రాత్రి భోజనం తర్వాత ముఖ్యులతో మాటామంతి
► రేపటి దిన చర్య కోసం ప్లాన్‌ వేసుకోవడం
ఆ రోజు అన్ని పనులు పూర్తయితే నిద్రకు ఉపక్రమించడం. ఈ తతంగం ముగిసే వరకు రాత్రి 12నుంచి 2గంటలు దాటుతోంది. ఒక్కోసారి ముఖ్యనేతల బహిరంగ సభలు ఉంటే తెల్లవారుజాము వరకు మేల్కొనే ఉంటున్నారు.

Advertisement
 
Advertisement