ధ్వని పెరిగితే దండనే
● ఆస్పత్రులు, విద్యా సంస్థలు, న్యాయస్థానాలు, మతపరమైన ప్రదేశాలు, అధీకృత అధికారిచే ప్రకటించిన ప్రదేశాలకు 100 మీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని నిశ్శబ్ధం మండలంగా ప్రకటించారు. మిగిలిన ప్రాంతాలను మిశ్రమ ప్రాంతాల కేటగిరీగా ప్రకటిస్తారు.
● జనావాసాల్లో లౌడ్ స్పీకర్లు, మైకులు, డీజేలు నిబంధనల ప్రకారం 10 డీబీ(డెసిబుల్స్) నుంచి 75 డీబీ లోపు వినియోగించేందుకు అనుమతి ఉంది.
● బహిరంగ సమావేశాలు, రోడ్‌షోలో మాత్రమే లౌడ్ స్పీకర్లు వినియోగాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తారు. ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఉంది.
● ఎన్నికల్లో వినియోగించే మైకులు, లౌడ్‌స్పీకర్లకు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతులు లేకుంటే వాహనాలను సీజ్ చేస్తారు.
● పోలింగ్‌కు 36 గంటల ముందు మైకులు, లౌడ్ స్పీకర్ల ప్రచారాలు నిలిపివేయాల్సి ఉంటుంది.
● ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్దేశిత ధ్వనికన్నా తీవ్రత పెరిగితే సదరు పార్టీలపై కేసు నమోదు చేయవచ్చు. ప్రజలు కూడా ఫిర్యాదు చేయవచ్చు.
● నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నిలక సంఘం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
పాలమూరు/అచ్చంపేట: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మైకులు, లౌడ్ స్పీకర్ల మోత మోగిస్తూ శబ్ధ కాలుష్యాన్ని విచ్చలవిడిగా చేస్తుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు లౌడ్ స్పీకర్లు ప్రచారంతో విద్యార్థులు, చిన్న పిల్లలు, వృద్ధులు, రోగులు తీవ్ర అసౌకర్యానికి గురువుతున్నారు. ఎన్నికల ప్రచారంలో పూర్తిగా మైకులు నిషేధం సాధ్యం కాకపోవడంతో ప్రమాణాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్డ్ ప్రకారం ఇంకా రెండురోజులు మాత్రమే ప్రచారం చేసుకునే వీలుంది. 11న పోలింగ్ ఉన్నందున ఈ నెల 9వ తేదీ సాయంత్రం ప్రచారం ముగియనుంది. కాగా.. పట్టణాన్ని ఏ, బీ, సీ, డీ కేటగీరిగా విభజించి.. ఆ మేరకే సౌండ్ ఉండేలా ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది.


