● ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు
● బావాజీ జాతరకు వేలాదిగా తరలి వచ్చిన భక్తులు
● దర్శించుకున్నమాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
కొత్తపల్లి: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలసిన గురులోకామసంద్ ప్రభు బావాజీ రథోత్సవం కనులపండుగగా సాగింది. గురువారం తెల్లవారు జామున రథోత్సవం, స్వామివారి పల్లకీ సేవా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి గిరిజనులు నృత్యాలు, భజనలు చేస్తూ ప్రభువును ఆరాదించారు. గురువారం తెల్లవారుజామున ఆలయ పూజారులు చందర్‌నాయక్, భీమ్లానాయక్ ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. రథాన్ని ఆలయ ముఖద్వారం నుంచి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం వరకు లాగారు. భక్తులు బావాజీకి తలనీలాలు సమర్పించి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని నివేదన చేశారు. జెండాలను ధ్వజారోహణం చేసి మొక్కు లు తీర్చుకున్నారు. ఉత్సవాల సందర్భంగా 40 మంది బిల్డర్స్ పూణా గ్రూప్ అసోసియేషన్‌గా ఏర్పడి భక్తులకు 8 ఏళ్లుగా అన్నదానం నిర్వహిస్తున్నారు.
రథోత్సవంలో భక్తుల కత్తి విన్యాసం
గురువారం తెల్లవారు జామున నిర్వహించిన రథోత్సవంలో పోలీసుల గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులతో పాటు నారాయణపేట జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి రాంచందర్, తహసీల్దార్ జయరాములు చేసిన కత్తి విన్యాసం ఆకట్టుకుంది.
ప్రశాంతంగా రథోత్సవం
బావాజీ జాతర రథోత్సవం పటిష్ట బందోబస్తు మధ్య తెల్లవారు జామున ప్రశాంతంగా ముగిసిందని అదనపు ఎస్పీ రియాజుల్ హక్ తెలిపారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించారన్నారు. జాతర పూర్తిగా ముగిసే వరకు పటిష్ట బందోబస్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోస్గి సీఐ సైదులు, ఎస్‌ఐ విజయ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
గురులోకామసంద్ ప్రభు రథోత్సవంలో భక్తజన సందోహం


