రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Apr 4 2026 8:31 AM | Updated on Apr 4 2026 8:31 AM

తాడూరు: మండల పరిధిలోని యాదిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ చెన్నొల్ల కాలనీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించాడు. మండల కేంద్రానికి చెందిన పాలబుత్‌ శంకర్‌ (28) గురువారం రాత్రి బలాన్‌పల్లిలో ఓ కార్యక్రమానికి హాజరై తాడురుకు బయలుదేరాడు. చెన్నొల్ల కాలనీ వద్దకు రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి గుంతలో పడడంతో బైకు కిక్‌ రాడ్‌ తలకు గుచ్చుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా విచారణ చేపట్టారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

రైతుపై అడవి పంది దాడి

జడ్చర్ల: వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటున్న ఓ రైతుపై అకస్మికంగా ఓ అడవి పంది దాడి చేసిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని ఉదండాపూర్‌ గ్రామ శివారులో వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతు గొంగండ్ల రామకృష్ణ(50) పై అడవి పంది దాడికి పాల్పడింది. రైతు తీవ్రంగా ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. దాడిలో రైతు శరీరం చిధ్రమైంది. కడుపులోని పేగులు పూర్తిగా బయటకు వచ్చాయి. సమీపంలోని రైతులు గమనించి 108లో వైద్య చికిత్స కోసం ఏనుగొండ ఎస్‌వీఎస్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం గ్రామస్తులు దాడికి పాల్పడిన అడవి పంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఉదండాపూర్‌ రిజర్వాయర్‌లో గుర్తించి మూకుమ్మడిగా దాడి చేసి చంపేశారు.

వివాహిత మృతిపై కేసు నమోదు

నాగర్‌కర్నూల్‌ క్రైం: ఇంట్లో ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గోవర్ధన్‌ శుక్రవారం తెలిపారు. పూర్తి వివరాలు.. జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన వివాహిత మహిళ లక్ష్మమ్మ(34) కూరగాయల వ్యాపారం నిర్వహిస్తుంది. ఆమె భర్త వెంకటస్వామి చేపల వ్యాపారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై గురువారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి చెల్లెలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement