రూ.2.89లక్షల నగదు పట్టివేత
నారాయణపేట: పట్టణ పరిధిలోని ఎర్రగుట్ట చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో రూ.2.89 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీలు చేపట్టగా కర్ణాటకకు చెందిన మల్లికార్జున రూ.1.80వేలు, జాఫర్ రూ.1.09 వేలు నగదును తరలిస్తుండగా పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే వస్త్రాలు కూడా స్వాధీనం చేసుకొని స్వాధీనం చేసుకున్న నగదును సామగ్రిని ఎన్నికల నియమావళి ప్రకారం గ్రీవెన్స్ కమిటీకి అందజేసినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని, అనుమతులు లేకుండా నగదు లేదా ఇతర వస్తువులు తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రూ.1.30 లక్షలు స్వాధీనం
కొత్తపల్లి (మద్దూరు): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన వాహన తనిఖీల్లో మద్దూరులో రూ.1.30లక్షలు నగదు పట్టుబడినట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు. వాహన తనిఖీల్లో భాగంగా ఓ ద్విచక్రవాహనాన్ని ఆపి తనిఖీ చేయగా నగదు పట్టుబడినట్లు తెలిపారు. నిందితుడిది దౌల్తాబాద్ మండలం చిన్న పస్లాబాద్ గ్రామమని, నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో ఎన్నికల నిబంధనల ప్రకారం సీజ్ చేసి గ్రీవెన్స్ కమిటీకి అప్పగించినట్లు పేర్కొన్నారు. అదే విధంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 21 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి రూ.11,500 జరిమానా విధించినట్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వాహన తనిఖీలు ప్రతి రోజు కొనసాగుతాయని, వాహనదారులు ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
తిమ్మాజిపేట: మండల పరిధిలోని రాళ్ల చెరువుతండాలో కెతావత్ తిరుపతి (18) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హారిప్రసాద్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా జడ్చర్ల నుంచి ఆవంచకు వెళ్లే రహదారిపై అదే తండాకు చెందిన విస్లావత్ ఈశ్వర్ కారును నిర్లక్ష్యంగా నడుపుతూ వెనుక నుంచి ఢీకొట్టడంతో తిరుపతి సృహా కోల్పోయి పడిపోయాడు. వెంటనే సమీప ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు మృతుడి తండ్రి శంకర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రూ.2.89లక్షల నగదు పట్టివేత


