
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
భూత్పూర్: విశ్వగురుగా తనంతటతానుగా ప్రమోట్ చేసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని మాట ఇచ్చిన మోడీ మాట తప్పారని, పాలమూరు గడ్డపై కాలు మోపే అర్హత లేదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ నివాసంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించారు. తొమ్మిదిన్నర ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు చేపడుతుంటే బీజేపీకి చెందిన నేతలు కేసులు వేయడం, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని ఉత్తరాలు రాసిన మాట వాస్తమా కాదా అని ప్రశ్నించారు. మళ్లీ ప్రాజెక్టుపై విషం కక్కుతున్నారని ఆరోపించారు. ఓట్ల కోసమే తెలంగాణకు వస్తున్నారని, 2014 కంటే ముందు భూత్పూర్, మహబూబ్‌నగర్‌లో అనాటి బహిరంగ సభల్లో సుష్మాస్వరాజ్‌తో కలిసి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పిన మోడీ, ఎందుకు కల్పించలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాకో జవహార్ నవోదయ పాఠశాల, కళాశాల ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో వట్టెం వద్ద మాత్రమే ఒకటి మాత్రమే నవోదయ పాఠశాల ఉందని, నాలుగు జిల్లాలో నాలుగు నవోదయ పాఠశాల, కళాశాల ఎందుకు ఏర్పాటు చేయడం లేదన్నారు. రాష్ట్రంపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని, దేశంలో 130 మెడికల్ కళాశాలలను ఇచ్చిన కేంద్రం తెలంగాణకు ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వలేదని విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ అధినాయకత్వం రాష్ట్రంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సీఎం కేసీఆర్ ప్రజలకు పనులు బాగా చేస్తున్నారని కితాబు ఇచ్చారని, మున్సిపాలిటీలకు, గ్రామాలకు స్వయంగా కేంద్రం అవార్డులు ఇస్తే రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా మోడీ విమర్శించి వెళ్లడం సమంజసం కాదన్నారు.
‘పాలమూరు’కు జాతీయ హోదా
కల్పిస్తామని మరిచారు..
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి