అందంగా లేనని యువకుడి బలవన్మరణం

నారాయణపేట రూరల్: ఎత్తు పళ్లతో అందవిహీనంగా ఉన్నానని బాధ పడుతూ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కొల్లంపల్లి పంచాయతీ నల్లగుట్టతండాకు చెందిన సురేష్ (23) ఇంటర్ వరకు చదువుకుని గ్రామంలోని తమ పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. కొంత కాలంగా తన నోటి పళ్ల విషయంలో ఉబ్బెత్తుగా ఉండటంతో అందవిహీనంగా కనిపిస్తున్నాని ఇంట్లో పలుమార్లు చెప్తూ బాధపడేవాడు. దీన్ని మనుసులో ఉంచుకుని గురువారం రాత్రి ఇంట్లో పురుగు మందు తాగాడు. గమనించిని కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి తండ్రి రాగ్యానాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
కడుపునొప్పి భరించలేక వృద్ధుడు..
గట్టు: మండలంలోని పెంచికలపాడుకు చెందిన జంగిలప్ప (73) శుక్రవారం కర్నూలులో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జంగిలప్ప కడుపు నొప్పి భరించలేక శుక్రవారం ఉదయం పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ రాంచందర్‌జీ తెలిపారు.
యువకుడి ఆత్మహత్య
బల్మూర్: మండల కేంద్రానికి చెందిన అశోక్ (25) శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయన స్థానికంగా భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం మద్యం మత్తులో పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబసభ్యులు అతన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో నాగర్‌కర్నూల్‌కు తీసుకెళ్లారు. చికిత్స అందిస్తుండగా ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియవని కుటుంబసభ్యులు తెలిపారు. సంఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
మరిన్ని వార్తలు :