కేయూ క్యాంపస్ : భూగ్రహానికి ప్లాస్టిక్ పెనుముప్పుగా మారిందని, పారిశ్రామిక విప్లవం మానవాళి జీవితాన్ని సౌకర్యవంతంగా చేసినా పర్యావరణానికి మాత్రం ప్రతికూల ప్రభావం కూడా పెరిగిందని భారత ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ మాజీ కార్యదర్శి, హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) పూర్వ డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ పూర్వ రిజిస్ట్రార్, ఫార్మసీ కళాశాల విశ్రాంత ప్రొఫెసర్ వి. మల్లారెడ్డి గౌరవార్థం యూనివర్సిటీలోని సెనెట్‌హాల్‌లో ఏర్పాటు చేసిన తొలి ఎండోమెంట్ లెక్చర్‌లో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు. ‘ఎట్ 120 ఇయర్స్ 2075 థ్రో సైన్స్‌అండ్ టెక్నాలజీ’ అనే అంశంపై ఆయన కీలకపోన్యాసం చేశారు. దేశానికి స్వా తంత్య్రం వచ్చేనాటికి సగటు ఆయురార్థం 40 సంవత్సరాలు ఉండగా ప్రస్తుతం 70 సంవత్సరాలు దాటిందన్నారు. వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన పురోగతి మానవ జీవన ప్రమాణాలను మెరుగుపర్చిందన్నారు. గ్లోబల్ వార్మింగ్, శిలిజ ఇంధనాల వినియోగం పెరుగుతున్నా కార్బన్ ఉద్గారాలు ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు అన్నారు. ప్లాస్టిక్‌తో ఏర్పడిన ముప్పును ఆ వ్యర్థాలను తిరిగి ఉపయోగకరమైన ముడి పదార్థాలకుగా మార్చేందుకు డి పాలిమరైజేషన్ ప్రక్రియను ప్రోత్సహించాలన్నారు. కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో మానవుడి సగటు ఆయురార్థం పెరిగినా ఒత్తిడి మధుమేహం, రక్తపోటు వంటి జీవన శైలి వ్యాధులు పెరిగిపోతున్నాయన్నారు. అనంతరం కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, ఫార్మసీ కళాశాల విశ్రాంత ఆచార్యులు మల్లారెడ్డి, రాంబాహు, విజయ్‌కుమార్, సారంగపాణి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి, కల్యాణ్ చక్రవర్తి మాట్లాడారు. విశ్రాంత ఆచార్యులు మల్లారెడ్డి దంపతులను ఐఐసీటీ పూర్వ డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, వీసీ ప్రతాప్‌రెడ్డి తదితరులు సన్మానించారు. విశ్రాంత గార్లపాలి అచ్చయ్య, డీన్ ఎన్. ప్రసాద్, కిషన్, రవీందర్, సంజీవరెడ్డి, సదానందం తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణంపై ప్రతికూల ప్రభావం
ఐఐసీటీ పూర్వ డైరెక్టర్
శ్రీవారి చంద్రశేఖర్
కేయూలో ఎండోమెంట్ లెక్చర్


