మహబూబాబాద్ రూరల్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ కోరారు. మానుకోట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ అనుబంధ సంఘాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబమని, మన ప్రజా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతీ ఒక్కరికి వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి విజయానికి యువత, విద్యార్థి విభాగం కీలకంగా వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వ పథకాలను, పార్టీ సిద్ధాంతాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి చొరవగా తీసుకుకెళ్తున్న సోషల్ మీడియా వారియర్లు షేక్ ఖాజాబాషా, ఎండి.ఖాజా, ఎండి.జలీల్‌ను ఎంపీ, ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతిరమేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఘనపురపు అంజయ్య, రాష్ట్ర టీపీసీసీ కోఆర్డినేటర్ అంబాల శివకుమార్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అజ్మీరా సురేష్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా త్రిశూల తీర్థోత్సవం
హన్మకొండ కల్చరల్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరుద్రేశ్వరస్వామివారి వేయిస్తంభాల దేవాలయంలోని ప్రాచీన కోనేటిలో త్రిశూల తీర్థోత్సవం (త్రిశూల స్నానం) మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, ప్రణవ్, దత్తకుమార్‌శర్మ శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి చతుషష్టి ఉపచారపూజలు, అపరాజితాదేవిపూజ, శమీపూజ చేసి రాజరాజేశ్వరీదేవిగా అలంకరించారు. గంగు ఉపేంద్రశర్మ శ్రీరుద్రేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని, త్రిశూలాన్ని పసుపుతో పూజించారు. అనంతరం పల్లకీలో ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలోని ప్రాచీన కోనేరు జలంలో శ్రీసూక్తవిధానంతో అవబృధస్నానం, జలాధివాసం, త్రిశూల తీర్థోత్సవం నిర్వహించారు. శ్రీరుద్రేశ్వరీదేవి ఉత్సవమూర్తిని తిరిగి దేవాలయంలో రుద్రేశ్వరుడి సన్నిధిలో ప్రతిష్టించారు.
అన్ని వర్గాల అభివృద్ధికి బాటలు వేస్తున్న ప్రభుత్వం
తొర్రూరు: కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి బాటలు వేస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రంలోని యతిరాజారావు పార్కులో దసరా వేడుకల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రావణవధ కార్యక్రమం మంగళవారం రాత్రి నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రావణ ప్రతిమకు నిప్పు పెట్టి వేడుకలు ఆరంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయమే దసరా పర్వదినమని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్‌కుమార్, వైస్ చైర్మన్ సోమ రజిని, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్రాచారి, పట్టణ అధ్యక్షుడు ముద్దసాని సురేష్, నాయకులు గంజి ప్రసాద్‌రెడ్డి, సోమ రాజశేఖర్, చింతకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి, జక్కా మహబూబ్‌రెడ్డి, అనిల్, కృపాకర్‌రాజు, పట్టణ వాసులు పాల్గొన్నారు.
చుక్కా రామయ్యకు సత్కారం
పాలకుర్తి టౌన్: ఎంతో మంది భవిష్యత్‌ను తీర్చిదిద్దిన మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవీ రమణాచారి బుధవారం విద్యానగర్‌లోని ఆయన నివాసంలో కలిశారు. రామయ్యకు పూలమాల, శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. విద్యారంగానికి రామయ్య అందించిన సేవలను ఈ సందర్భంగా వారంతా కొనియాడారు.


