ప్రజా రక్షణకు అంకితభావంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా రక్షణకు అంకితభావంతో పనిచేయాలి

Oct 22 2026 3:44 AM | Updated on Oct 22 2026 3:44 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : పోలీస్‌ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, అమరుల స్ఫూర్తితో ప్రజా రక్షణకు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌, ఎస్పీ శబరీష్‌ అన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని అమరవీరుల స్తూపం వద్ద పోలీసు అమరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివన్నారు. దేశ అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో పోలీసుల పాత్ర కీలకమని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరుల త్యాగాలు ప్రతీ పోలీసు అధికారికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తెలంగాణలో గతంలో నక్సలిజం ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో అనేక మంది పోలీసులు ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. విధి నిర్వహణలో చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ నెల 31న నిర్వహించే సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి, జాతీయ ఐక్యత దినోత్సవం వరకు పోలీస్‌ అమరవీరులను స్మరించుకుంటూ ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువచేసే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డీఎస్పీ (అడ్మిన్‌) మోహన్‌, మానుకోట, తొర్రూరు డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిషోర్‌, ఏఆర్‌ డీఎస్పీలు శ్రీనివాస్‌, విజయ్‌ ప్రతాప్‌, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌ స్నేహశబరీష్‌, ఎస్పీ శబరీష్‌

ఘనంగా పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement