పల్లెకు ‘జలసిరి’.. రోడ్లకు హ్యామ్‌ జోష్‌ | - | Sakshi
Sakshi News home page

పల్లెకు ‘జలసిరి’.. రోడ్లకు హ్యామ్‌ జోష్‌

Sep 26 2026 1:20 AM | Updated on Sep 26 2026 1:20 AM

సాక్షిప్రతినిఽధి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల గ్రామీణ ప్రాంతాలకు రహదారి అనుసంధానంతోపాటు నీటి భద్రత, ఉపాధి అవకాశాలు, శాశ్వత ఆస్తుల సృష్టికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో భాగంగా రెండు పూర్వ జిల్లాల్లో హ్యామ్‌ రోడ్ల పనులను అక్టోబర్‌ 25 నుంచి దశలవారీగా ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధమైందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క (అనసూయ) తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్‌లో శుక్రవారం ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, వీబీ జీరామ్‌జీ, ఎల్‌నినో సన్నద్ధత, హ్యామ్‌ రోడ్లపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఉపాధి అంటే కూలీ మాత్రమే కాదు..

‘జలసిరి’తో నీటి భద్రత

ఉపాధి హామీ (వీబీజీ రామ్‌జీ) పనులను పని దినాల కల్పనకే పరిమితం చేయకుండా గ్రామాల్లో శాశ్వత ఆస్తులను సృష్టించేలా మారుస్తున్నట్లు సీతక్క తెలిపారు. జలసిరి కార్యక్రమం కింద ప్రతీ ఇంటికి ఇంకుడు గుంత.. ప్రతీ ఊరికి ఊటకుంట.. ప్రతీ పంటకు పంటకుంట నిర్మించనున్నట్లు తెలిపారు. ఏజెన్సీ గ్రామాల్లో వాగుల వద్ద చెక్‌డ్యామ్‌లు నిర్మించి వర్షపు నీటిని నిల్వ చేయడం, భూగర్భ జలాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న గ్రామ సమగ్ర ప్రణాళికలను రూపొందించి ఆవిష్కరించనున్నట్లు సీతక్క తెలిపారు. గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో ఏ పనులు అవసరమో గుర్తించి అభివృద్ధి మ్యాప్‌ తయారు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో తాగునీటి అవసరాలకు సరిపడా నీరు అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. అయినప్పటికీ వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో పంచాయతీరాజ్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ దాన కిషోర్‌, కమిషనర్‌ దివ్య దేవరాజన్‌, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు చాహత్‌ బాజ్‌పాయ్‌, సత్యశారద, స్పెషల్‌ కమిషనర్‌ శ్రీలక్ష్మి, అడిషనల్‌ కమిషనర్‌ రవీందర్‌, మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌ రెడ్డి, పంచాయతీరాజ్‌ ఈఎన్‌సీ జగదీశ్వర్‌, వరంగల్‌ బల్దియా కమిషనర్‌ వెంకన్నతో పాటు ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల అడిషనల్‌ కలెక్టర్‌లు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.

వరంగల్‌ నుంచి ఖమ్మం వరకు

పనుల కదలిక..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ పనులను నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి సీతక్క చెప్పారు. రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలో 445 రహదారులను 1,366 కి.మీ. మేర అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం సుమారు రూ.1,130 కోట్ల వరకు వ్యయం కానుందని, ఇందులో 90 శాతం మేర ఇప్పటికే ఉన్న రహదారులను అభివృద్ధి చేయనుండగా.. 10 శాతం మేర కొత్త రహదారులు నిర్మించనున్నట్లు వివరించారు. ప్రతీ ఆవాసం నుంచి గ్రామానికి, గ్రామం నుంచి మండల కేంద్రానికి రహదారి సౌకర్యం ఉండాలన్నదే హ్యామ్‌ రోడ్ల లక్ష్యమని పేర్కొన్నారు.

ఉపాధి పనులతోపాటు గ్రామాల్లో శాశ్వత ఆస్తుల సృష్టి

ఏజెన్సీ గ్రామాల్లో వాగులపై చెక్‌డ్యామ్‌లు

అక్టోబర్‌ 2న గ్రామ సమగ్ర ప్రణాళికలకు శ్రీకారం

ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం అధికారులతో మంత్రి ధనసరి సీతక్క సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement