అప్రమత్తతే శ్రీరామరక్ష.. | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తతే శ్రీరామరక్ష..

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

హన్మకొండ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ వర్షాలను ఎదుర్కొనేందుకు పూర్తి సమాయత్తంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వినియోగదారులు విద్యుత్‌పై అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

చిన్న నిర్లక్ష్యం కూడా

ప్రాణాంతక ప్రమాదాలకు దారి..

విద్యుత్‌పై అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ప్రధానంగా వర్షాకాలంలో తరచూ విద్యుత్‌ ప్రమాదాలు సంభవిస్తుంటాయి. తడిదుస్తులు ఆరేస్తూ, మోటార్లు ఆన్‌ చేస్తూ, మరమ్మతుల సమయంలో విద్యుత్‌ తీగలు పట్టుకుని, తెగిన తీగల కారణంగా తరచూ వ్యక్తుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. తెగిన విద్యుత్‌ లైన్లు, టాన్స్‌ఫార్మర్‌ గద్దెలు ఎత్తు తక్కువగా ఉండడంతో పశువులు విద్యుదాఘాతానికి గురై చనిపోతున్నాయి. ఫలితంగా రైతులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. విద్యుత్‌ సిబ్బంది భద్రతా చర్యలు పాటించకపోవడంతోపాటు ఎల్‌సీల్లో నిబంధనలు పాటించకపోవడం, నిర్లక్ష్యం కారణంగా విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. విద్యుత్‌ సంస్థల యాజమాన్యం హెచ్చరించినా, జాగ్రత్తలు పాటించాలని సూచించినా సిబ్బంది, వినియోగదారులు భద్రతను విస్మరించి విలువైన ప్రాణాలను పోగొట్టకుంటూ కుటుంబాన్ని దుఖఃసాగరంలో ముంచుతున్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విద్యుత్‌ భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం సూచిస్తోంది. దీనిని ఉద్యోగులు, వినియోగదారులు కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది.

తడిసిన పరికరాలను తాకొద్దు..

ప్రజలందరూ విద్యుత్‌పై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షం సమయంలో తడిసిన విద్యుత్‌ స్తంభాలు, పరికరాలు, స్టే వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను తాకరాదు, తెగిన లేదా వేలాడుతున్న విద్యుత్‌ తీగలకు దూరంగా ఉండాలి. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకూడదు. అవసరం లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించొద్దు. తడి చేతులతో స్విచ్‌లు, ప్లగ్‌లు, మీటరు బోర్డులు, మోటార్లు వంటి విద్యుత్‌ పరికరాలను తాకరాదు. సెల్‌ఫోన్‌ చార్జింగ్‌లో ఉండగా మాట్లాడొద్దు. నాణ్యమైన ఎర్తింగ్‌తో పాటు ఐఎస్‌ఐ ప్రమాణాలు కలిగిన విద్యుత్‌ పరికరాలను మాత్రమే ఉపయోగించాలి. పాడైన వైర్లను వెంటనే మార్చాలి. రైతులు వ్యవసాయ మోటార్లను ఆన్‌ చేసే ముందు స్టార్టర్లు, వైర్లు, స్విచ్‌లను పరిశీలించాలి. మోటార్లు, పంపుసెట్లకు సరైన ఎర్తింగ్‌ చేయించాలి. వ్యవసాయ భూముల్లో ఎలక్ట్రిక్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చట్టవిరుద్ధం. ప్రాణాంతకం.

వర్షాకాలంలో విద్యుత్‌ ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాలి

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

వినియోగదారులకు టీజీ ఎన్పీడీసీఎల్‌ అధికారుల సూచనలు

పిల్లలను విద్యుత్‌ స్తంభాల వద్ద ఆడనీయొద్దు..

పిల్లలను విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, మీటరు బోర్డుల వద్ద ఆడనీయొద్దు. పశువులను విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు కట్టెయొద్దు. షాక్‌కు గురైన వ్యక్తిని నేరుగా తాకకుండా, విద్యుత్‌ ప్రసారం జరగని వస్తువులతో వేరు చేయాలి. వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిపివేసి వైద్య సాయం అందించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement