అసమర్థ పాలనతోనే విద్యుత్‌ సంక్షోభం | - | Sakshi
Sakshi News home page

అసమర్థ పాలనతోనే విద్యుత్‌ సంక్షోభం

Sep 25 2026 1:35 AM | Updated on Sep 25 2026 1:35 AM

గంటపాటు ఉద్రిక్తత

బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలను బారికేడ్లతో

అడ్డుకుంటున్న పోలీసులు

కేటీపీపీ వద్ద ఆందోళనలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చిత్రంలో

మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌ నేతలు

గణపురం: కాంగ్రెస్‌ అసమర్థ పాలనతోనే రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం నెలకొందని.. దీంతో రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారని మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కాకతీయ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (కేటీపీపీ)ను గురువారం బీఆర్‌ఎస్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు సీనియర్‌ నేతలు సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నా వినియోగించుకోలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం అసమర్థ పాలన చేస్తోందన్నారు. సింగరేణి సంస్థకు జెన్‌కో సంస్థ రూ.52 వేల కోట్ల బకాయి పడిందని.. దీంతో సింగరేణి బొగ్గును ఉత్పత్తి చేయకపోవడంతో విద్యుత్‌ ఉత్పత్తి చేయడం లేదన్నారు. తమ నాయకుడు కేటీఆర్‌ మాట్లాడితే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంత డబ్బు ఖర్చు అయిన ఇతర ప్రాంతాల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయాలని చెప్పడం సిగ్గు చేటన్నారు. కేటీపీపీలో 1100 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి గాను కేవలం 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి మాత్రమే అవుతుందన్నారు. అధికారులను అడిగితే ఉత్పత్తి తగ్గిన విషయం వాస్తవమే అన్నారని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తిని సరిపడా చేసుకునే ప్లాంట్లు ఉన్నప్పటికీ చేతగానితనంతో ఉత్పత్తి చేయలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సింగరేణి సంస్థ 2,900 కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు. జెన్‌కోకు రోజుకు 8వేల టన్నుల బొగ్గును సింగరేణి ఇవ్వాల్సి ఉండగా ఎందుకు ఇవ్వడం లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రెండు నెలల బొగ్గు నిల్వలు ఉండేవన్నారు. ఇప్పుడు కనీసం 15 రోజులకు సరిపడా నిల్వలు లేవన్నారు. తమ ప్రభుత్వ పాలనలో 24 గంటల విద్యుత్‌ ఉత్పత్తి చేసి ప్రతీ ఎకరాకు సాగునీరు అందించామన్నారు. దేవాదులనుంచి గోదావరి నీటిని ఎత్తిపోసే తెలివి లేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్‌, శంకర్‌ నాయక్‌, నాయకులు కాకులమర్రి లక్ష్మణ్‌ బాబు, బడే నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ బృందాన్ని మొదట కేటీపీపీ లోపలికి వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గంటపాటు ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహానికి గురైన మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు బారికేడ్లను నెట్టివేసి ప్రధాన గేటు వద్ద ఆందోళన చేపట్టారు. స్పందించిన పోలీసులు వారి సొంత పూచికత్తుపై ప్లాంటులోకి అనుమతించారు. ప్లాంటును సుమారు గంటకు పైగా పరిశీలించిన బృందం సభ్యులు అనంతరం అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే పల్లా

కేటీపీపీ సందర్శించిన బీఆర్‌ఎస్‌ బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement